గోదావరి పుష్కరాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేయాలి
- మేడారం జాతరలో వినియోగించిన సాంకేతిక నైపుణ్యాన్ని ఈ పుష్కరాల్లోనూ సమర్థంగా వాడాలి
- ప్రయాగ్రాజ్, నాశిక్ కుంభమేళాల తరహాలో వేలాది కెమెరాలతో పటిష్టమైన భద్రత కల్పించాలి
- భక్తుల రద్దీని నియంత్రించేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి
- గోదావరి పుష్కరాల భద్రత ఏర్పాట్లపై డీజీపీ బి.శివధర్ రెడ్డి సమీక్ష
విశ్వంభర, తెలంగాణ బ్యూరో : గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు చేపట్టవలసిన భద్రత ఏర్పాట్లపై తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీ బి శివధర్ రెడ్డి తెలిపారు. డీజీపీ కార్యాలయంలో ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యార్, వివిధ జిల్లాల పోలీస్ అధికారులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వచ్చే సంవత్సరం జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరగనున్న గోదావరి పుష్కరాలకు పకడ్బందీ భద్రత ఏర్పాటు చేయాలని డీజీపీ, ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సూచించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి గోదావరి పుష్కరాల సమయంలో ఉమ్మడి జిల్లాలు ఉండేవని, ప్రస్తుతం జిల్లాల సంఖ్య పెరిగిన దృష్ట్యా క్షేత్రస్థాయిలో పనులపై అధికారులు సమగ్ర నివేదికలు తయారు చేయాలన్నారు. మేడారం జాతరలో వినియోగించిన సాంకేతిక నైపుణ్యాన్ని, అనుభవాన్ని ఈ పుష్కరాల్లోనూ సమర్థంగా వాడాలని డీజీపీ సూచించారు. ప్రధానంగా సీసీ కెమెరాలు, ముఖ గుర్తింపు (ఫేషియల్ రికగ్నిషన్) వ్యవస్థ, వాహన నంబర్లను గుర్తించే ఏఎన్‌పీఆర్ కెమెరాలు, డ్రోన్ సర్వైలెన్స్ వంటి సౌకర్యాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రయాగ్రాజ్, నాశిక్ కుంభమేళాల తరహాలో వేలాది కెమెరాలతో పటిష్టమైన భద్రత కల్పించాలన్నారు. గోదావరి నది ప్రవహిస్తున్న నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి, ములుగు,భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల్లో అధికారులు పనులను ప్రారంభించాలన్నారు. తాగునీటి నాణ్యత పర్యవేక్షణ, స్మార్ట్ బిన్స్, ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగ్ కలిగిన పారిశుద్ధ్య వాహనాలు తాత్కాలిక సోలార్ గ్రిడ్ వంటివి ఈ పుష్కరాల ప్రత్యేకత కానున్నాయన్నారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో శాంతిభద్రతల ఏడీజీపీ మహేష్ ఎం భగవత్, ఐజీలు ఎస్.చంద్రశేఖర్ రెడ్డి, గజరావు భూపాల్, ఏఐజి రమణ కుమార్, వివిధ జిల్లాల ఎస్పీలు ,కమిషనర్లు , ఎండోమెంట్ శాఖాధికారులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని తమ అభిప్రాయాలు తెలియజేశారు.
అఖిల భారత పోలీస్ ఫుట్‌బాల్ ఛాంపియన్ షిప్ ఏర్పాట్లపై డీజీపీ సమీక్ష..
తెలంగాణ పోలీస్ శాఖ ఆతిథ్యమిస్తున్న 74వ 'బి.ఎన్. ముల్లిక్ మెమోరియల్ ఆలిండియా పోలీస్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్-2026' ఏర్పాట్లపై డీజీపీ బి. శివధర్ రెడ్డి బుధవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వచ్చే నెల మార్చి 23 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు హైదరాబాద్ వేదికగా జరగనున్న ఈ క్రీడా సంబరానికి సంబంధించిన ఏర్పాట్లను డీజీపీ పరిశీలించారు. దేశవ్యాప్తంగా ఉన్న ఫుట్బాల్ పోలీస్ క్రీడాకారులు ఈ పోటీల్లో తలపడనున్నారని డీజీపీ తెలిపారు. క్రీడా కారులకు స్వాగతం పలికేందుకు సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లతో పాటు శంషాబాద్ విమానాశ్రయం వద్ద ప్రత్యేక రిసెప్షన్ బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రతి జట్టుకు హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రావీణ్యం ఉన్న ఒక లైజన్ ఆఫీసర్‌ను కేటాయించాలని, రవాణా కోసం ప్రత్యేక బస్సులను కేటాయించడం, వారు బస చేసే చోట అవసరాలను కూడా లైజన్ ఆఫీసర్లు చూస్తారని తెలియజేశారు. ఈ మెగా ఈవెంట్ కోసం ప్రత్యేక వెబ్‌సైట్, సోషల్ మీడియా ప్రచారంతో పాటు లోగో, మాస్కట్, టీ-షర్టులు, మెడల్స్ వంటి బాధ్యతలను ఇమేజిల్ అడ్వర్టైజింగ్ సంస్థకు అప్పగించారు. ఈ సమీక్షలో ఆర్‌బివిఆర్ఆర్ టీజీపీఏ డైరెక్టర్ అభిలాషా బిష్త్, ఏడీజీపీలు మహేష్ ఎం. భగవత్, అనిల్ కుమార్, సంజయ్ కుమార్ జైన్, సీపీలు అవినాష్ మహంతి, డాక్టర్ ఎం. రమేష్, ఐజిలు గజరావు భూపాల్, రమేష్ నాయుడు, అడిషినల్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.



