ఇంటర్  పరీక్షా కేంద్రాల పరిశీలన 

ఇంటర్  పరీక్షా కేంద్రాల పరిశీలన 

విశ్వంభర, సంగారెడ్డి: జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పరీక్ష కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ మహిళా జూనియర్ కాలేజ్, సెయింట్ ఆంథోని కాలేజ్, ఎస్.వి జూనియర్ కాలేజ్ పరీక్ష కేంద్రాల్లో ఏర్పాటు చేసిన బందోబస్తు, సీసీ కెమెరాల పర్యవేక్షణ, మెడికల్ ఎమర్జెన్సీ టీమ్‌లు, తాగునీరు  ఇతర కనీస వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 163 బి.యన్.యస్.యస్ (144 సెక్షన్) అమలులో ఉంటుందని, కేంద్రాల పరిసరాల్లో ఎవ్వరూ గుంపులుగా తిరగడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు.ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు పరీక్షలు జరుగుతున్నందున, పరీక్ష కేంద్రం నుండి 100 మీటర్ల పరిధిలో జిరాక్స్ సెంటర్లు మరియు అనవసర దుకాణాలు తెరిచి ఉంచరాదని ఆదేశించారు.అభ్యర్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు పోలీసు శాఖ పూర్తిస్థాయి సహకారం అందిస్తుందని ఎస్పీ తెలిపారు.

Tags: