నీలం మధు చౌకబారు రాజకీయాలు మానుకోవాలి
- కరికె సత్యనారాయణ ధ్వజం
విశ్వంభర, పటాన్ చెరు: తన కుటుంబానికి ఇస్నాపూర్ మున్సిపల్ చైర్మన్ పదవి దక్కలేదనే అక్కసుతోనే నీలం మధు చౌకబారు రాజకీయాలకు దిగుతున్నారని బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు కరికె సత్యనారాయణ తీవ్రంగా విమర్శించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ , ఇస్నాపూర్ రాజకీయ పరిణామాలపై మండిపడ్డారు.మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిల దిష్టిబొమ్మలను దగ్ధం చేయడం వెనుక పూర్తిగా రాజకీయ స్వార్థం దాగి ఉందని ఆయన ధ్వజమెత్తారు. ఎంపీ, ఎమ్మెల్యే పదవులతో పాటు స్థానిక సంస్థల పదవులు కూడా తన కుటుంబానికే దక్కాలనే నీచ రాజకీయాలకు నీలం మధు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.నీలం మధు ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేసిన సమయంలో ఒక బీసీ బిడ్డ అని భావించి అనేక బీసీ సంఘాలు అండగా నిలిచాయి. కానీ, ఇప్పుడు అదే బీసీ వర్గానికి చెందిన మోటే సుమలత మున్సిపల్ చైర్మన్‌గా ఎదుగుతున్న తరుణంలో ఆమెకు మద్దతు ఇవ్వాల్సింది పోయి అడ్డంకులు సృష్టించడం శోచనీయం అని కరికె సత్యనారాయణ అన్నారు. నీలం మధు ఇంకా యువ నాయకుడని, మంచి భవిష్యత్తు ఉందని పేర్కొన్న ఆయన.. ఇలాంటి రాజకీయాలు మానుకుని ప్రజల మద్దతు పొందే దిశగా సాగాలని సూచించారు. స్వార్థ ప్రయోజనాల కోసం ఇలాంటి చర్యలకు పాల్పడితే ప్రజలే రాజకీయంగా సమాధి కడతారని ఆయన హెచ్చరించారు. బీసీ బిడ్డ మోటే సుమలతకు మద్దతు తెలిపి ఉంటే ప్రజలు హర్షించేవారని, కానీ ఇలాంటి చర్యలతో నీలం మధు తన స్థాయిని తానే తగ్గించుకుంటున్నారని విమర్శించారు.



