దమ్మ శాంతియాత్రకు ఘనస్వాగతం
విశ్వంభర, చింతపల్లి : బుద్ధ భగవానుని పవిత్ర అస్థిక లతో బౌద్ధ భిక్షువుల దమ్మ శాంతి యాత్రకు తెలంగాణ మలిదశ ఉద్యమ నాయకుడు, న్యాయవాది బావుండ్లపల్లి చెన్నయ్య ఆధ్వర్యంలో బౌద్ధ బిక్షులకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా బౌద్ధ బిక్షువులు చేపడుతున్న పాదయాత్రకు చింతపల్లి గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున వారికి పూలతో స్వాగతం పలికారు. బౌద్ధ భిక్షువులు, అంబేద్కర్ సంఘం నాయకులు చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలను వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బుద్దిస్ట్ సొసైటీ ఇండియా తెలంగాణ అధ్యక్షులు పరంధాములు, బావుండ్లపల్లి చెన్నయ్య మాట్లాడుతూ, భారతీయ బౌద్ధ సంస్థ (బిఎస్ఐ) ఆధ్వర్యంలో బుద్ధుని అస్థికలను నాగార్జునసాగర్ తీసుకువెళ్లే క్రమంలో పాదయాత్రలో భాగంగా థాయ్ ల్యాండ్, మలేషియా, కంబోడియా, వియత్నాం దేశాల బౌద్ధ బిక్షువులు సుమారు 100 మంది పాదయాత్రలో పాల్గొన్నారని తెలిపారు. కర్ణాటక గుల్బర్గా సిద్ధార్థ విహార నుండి ఫిబ్రవరి 2వ తారీఖు నుండి ప్రారంభమైన ఈ దమ్మ శాంతి పాదయాత్ర హైదరాబాద్ మీదుగా బుధవారం చింతపల్లి మండల కేంద్రానికి చేరుకుందన్నారు. ముఖ్య అతిథిగా గగన్ మహల్ హాజరయ్యారు. ఈ కార్యక్రమం అనంతరం జిపి రెడ్డి కన్వెన్షన్ హాల్లో బౌద్ధ బిక్షువులకు బస ఏర్పాటు చేశారు. మార్చి 2వ తేదీ వరకు నాగార్జునసాగర్ చేరుకొని బుద్ధుని అస్థికలను అక్కడికి చేర్చి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం పాదయాత్ర ముగుస్తుందన్నారు. యాత్రకు స్వాగతం పలికిన వారిలో బహుజనులు, అంబేద్కర్ సంఘ నాయకులు, అభిమానులు, డాక్టర్ వెంకటేశ్వర్లు, నర్సింగ్ రావు, ఎం. సునీల్ రెడ్డి, గోరేటి గణేష్, బాల్ నారాయణ, వింజమూరు కృష్ణ మాదిగ, ఎర్ర జగన్, ఎలిమినేటి నరసింహ్మ, చెట్టిపల్లి మల్లికార్జున్ కురుమేటి మల్లయ్య, పల్లేటి యాదగిరి, ఆగీరు రవి, వి. కె శీను, సముద్రాల నగేష్, గోవింద్ రవి కుమార్, చెట్లపల్లి హరిప్రసాద్, వందనపు ఆంజనేయులు, కొప్పుల శ్రీను తదితరులు పాల్గొన్నారు.



