ఉక్రెయిన్‌కు షాకిచ్చిన స్లొవేకియా..!

ఉక్రెయిన్‌కు షాకిచ్చిన స్లొవేకియా..!

విశ్వంభర, నేషనల్ బ్యూరో:  ఉక్రెయిన్‌ విద్యుత్‌ వ్యవస్థలే లక్ష్యంగా రష్యా భీకర దాడులు చేస్తున్న క్రమంలో.. కీవ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఉక్రెయిన్‌ కు అత్యవసర విద్యుత్తు సరఫరాను నిలిపివేస్తున్నట్లు స్లొవేకియా ప్రకటించింది. రష్యా నుంచి స్లొవేకియాకు సరఫరా అయ్యే చమురును కీవ్‌ ఆపడమే రెండు దేశాల మధ్య వివాదానికి దారితీసినట్లు తెలుస్తోంది.ఉక్రెయిన్‌లోని భూభాగం మీదుగా వెళ్లే డ్రుజ్బా పైప్‌లైన్‌ ద్వారా మధ్య ఐరోపా ప్రాంతానికి రష్యా ముడి చమురు సరఫరా అవుతోంది. అయితే, జనవరి 27 నుంచి స్లొవేకియా, హంగరీకి చమురు సరఫరా నిలిచిపోయింది. రష్యా జరిపిన భీకర డ్రోన్‌ దాడుల్లో డ్రుజ్బా పైప్‌లైన్‌ దెబ్బతిందని ఉక్రెయిన్‌ అధికారులు పేర్కొన్నారు. కానీ, కీవ్‌ ఉద్దేశపూర్వకంగానే చమురు సప్లయ్‌ను నిలిపివేసిందని స్లొవేకియా ఆరోపించింది. పైప్‌లైన్‌ బాగానే ఉందని, దాన్ని పరిశీలించేందుకు తమ రాయబారికి ఉక్రెయిన్‌ అనుమతినివ్వడం లేదని పేర్కొంది. దీనిపై చర్చించేందుకు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలన్‌స్కీ నిరాకరిస్తున్నారని తెలిపింది.అందుకే ఆ దేశంపై ప్రతీకార చర్యలు చేపట్టామని స్లొవేకియా ప్రధాని రాబర్ట్‌ ఫికో (Robert Fico) వెల్లడించారు. ఉక్రెయిన్‌కు అత్యవసర విద్యుత్తు సరఫరాను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. రష్యా చమురు సరఫరాను కీవ్‌ పునరుద్ధరించే వరకు ఈ చర్యలు కొనసాగుతాయన్నారు.చమురు సరఫరా తిరిగి ప్రారంభం కాకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఫికో బెదిరించారు. ఈయూలో సభ్యత్వం కోసం కీవ్‌ చేస్తోన్న ప్రయత్నాలకు మద్దతివ్వడం మానేస్తామని హెచ్చరించారు. ఐరోపా సమాఖ్యకు చెందిన స్లొవేకియా, హంగరీ రష్యా అనుకూల దేశాలు కావడం గమనార్హం. మరోవైపు, తాజా పరిణామాలపై ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి స్పందించారు. ఆ రెండు దేశాలు సంయమనం పాటించాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.

Tags: