భద్రాచలం దేవస్థానంలో విజిలెన్స్ తనిఖీలు

భద్రాచలం దేవస్థానంలో విజిలెన్స్ తనిఖీలు

  • వస్త్రాల కౌంటర్లు, ప్రచార శాఖపై దృష్టి 
  • పట్టుచీర మాయం ఘటనపై ప్రత్యేక విచారణ

విశ్వంభర, భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దేవస్థానంలోని పలు విభాగాల్లో ఇటీవల వచ్చిన ఫిర్యాదులు, అనుమానాస్పద పరిణామాల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. ఇటీవల వస్త్రాల విక్రయ కౌంటర్లలో దేవస్థానం అధికారికంగా అనుమతించని బయట వస్త్రాలు కనిపించిన అంశంపై విజిలెన్స్ అధికారులు ప్రత్యేకంగా పరిశీలించారు. సంబంధిత కాంట్రాక్టర్‌ను తొలగించిన తర్వాత కూడా అవకతవకలు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది. స్టాక్ రిజిస్టర్లు, సరఫరా వివరాలు, అమ్మకాల లెక్కలు తదితర రికార్డులను అధికారులు తనిఖీ చేసినట్లు తెలిసింది. అదేవిధంగా, ప్రచార శాఖలో చోటుచేసుకున్న అవకతవకలపై చర్యలు తీసుకుంటూ ఒక ఉద్యోగిపై రూ. 2 లక్షల పెనాల్టీ విధించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, విధానాల ఉల్లంఘన వంటి అంశాలపై విచారణ జరిపిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. హైదరాబాదుకు చెందిన భక్తులు సమర్పించిన విలువైన పట్టుచీర మాయమైన ఘటన కూడా తనిఖీలలో ప్రధానాంశంగా నిలిచింది. సమర్పణ రిజిస్టర్, భద్రపరిచిన వివరాలు, సంబంధిత సీసీటీవీ ఫుటేజీలను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఘటనకు బాధ్యులెవరు అన్న దానిపై ప్రత్యేక విచారణ కొనసాగుతోంది. పలు ఫిర్యాదుల మేరకు దేవస్థానంలోని ఇతర విభాగాల రికార్డులను కూడా విజిలెన్స్ అధికారులు సమీక్షిస్తున్నారు. ఒక ఉద్యోగి బదిలీ, పునఃస్థాపనకు సంబంధించిన అంశాలపై కూడా విచారణ కొనసాగుతున్నట్లు సమాచారం. విచారణ పూర్తయ్యాక తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. దేవస్థాన పరిపాలనలో పారదర్శకత, నియమ నిబంధనల అమలు పట్ల విజిలెన్స్ అధికారులు కట్టుదిట్టమైన వైఖరి అవలంబిస్తున్నారని, భక్తుల విశ్వాసాన్ని దృష్టిలో ఉంచుకుని తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు.

Tags: