క్రమశిక్షణే పునాది ..  విద్యే ఆయుధం

క్రమశిక్షణే పునాది ..  విద్యే ఆయుధం

  • ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు

విశ్వంభర, హనుమకొండ: ''మత్తు వదలండి - మైదానానికి రండి.. మత్తు వదలండి - చదువుతో సత్తా చాటండి'' అనే నినాదం కేవలం ఒక మాట కాదు, అది రేపటి తరానికి ప్రాణవాయువు కావాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు ఆకాంక్షించారు. హనుమకొండ జిల్లా భీమవరం సమీపంలో ఉన్న అల్ఫోర్స్ పాఠశాల వార్షికోత్సవంలో ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు మాట్లాడుతూ,  సెల్ ఫోన్లు  ఒక ఆధునిక నరకం అని ​నేటి కాలంలో పిల్లలు సెల్ ఫోన్లకు బానిసలవుతుండటంపై  ఆందోళన వ్యక్తం చేశారు. ఇంట్లో టీవీ సీరియళ్ల ప్రభావం వల్ల కూడా సమాజంలో నేరప్రవృత్తి పెరుగుతోందని అన్నారు. చిన్నప్పటి నుండే పిల్లలకు విలువలతో కూడిన విద్యను అందించాలని ఆయన కోరారు. కేవలం ఫీజులు కట్టడమే కాకుండా, పిల్లలతో సమయం గడపాలని, వారి స్నేహాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ​ఉపాధ్యాయుడు కొట్టగానే ఫిర్యాదు చేసే ధోరణి మారాలని, క్రమశిక్షణ కోసం బెత్తం పట్టడంలో తప్పు లేదని ఆయన అభిప్రాయపడ్డారు. తన చిన్నతనంలో ఉపాధ్యాయుడు కొట్టిన సంఘటనను గుర్తు చేసుకుంటూ, ఆ క్రమశిక్షణే తనను ఈ స్థాయిలో నిలబెట్టిందని ఆయన తెలిపారు.​ కులం ప్రాతిపదికన హాస్టళ్లు ఉండకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని, అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను తీసుకువచ్చారని అన్నారు. అంబేద్కర్ సిద్ధాంతాలను నమ్ముతూ, సామాజిక రుగ్మతలను పారద్రోలడానికి విద్యే ఏకైక మార్గమని ఆయన స్పష్టం చేశారు.  ​అల్ఫోర్స్ సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఆంధ్ర విద్యాసంస్థలతో పోటీ పడుతూ తెలంగాణలో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, దేశంలోనే అల్ఫోర్స్ ని నెంబర్ వన్ గా నిలబెట్టడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ పాలకుర్తి సారంగపాణి, వైస్ చైర్ పర్సన్ నేతవత్ శిభారాణి రాజేందర్,మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య,వివిధ వార్డుల కౌన్సిలర్స్ దేవేందర్, వాణి,ఖమిలి ఖీమా,ప్రిన్సిపాల్ సింహాద్రి,వేణు,ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Tags: