దళితులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి

దళితులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి

  • మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లాడి

విశ్వంభర, భద్రాచలం: భద్రాచలంలోని స్థానిక అయ్యప్ప కాలనీలో మాల మహానాడు ముఖ్య కార్యకర్తల సమావేశం డేగల శివ అధ్యక్షతన జరిగింది. సమావేశానికి హాజరైన నాయకులు, కార్యకర్తలు ఏజెన్సీ ప్రాంతాల్లో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. సమావేశాన్ని ఉద్దేశించి మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లాడి పౌల్ రాజ్ మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న దళితులను రాజకీయ పార్టీలు కేవలం ఓటర్లుగానే పరిగణిస్తున్నాయని విమర్శించారు. పేదరికం నిర్మూలనలో ఆశించిన పురోగతి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారుతున్నా నిరుపేదల జీవితాల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకోవడం లేదని పేర్కొన్నారు. ప్రతి కాలనీలో ఇప్పటికీ నిలువ నీడలేని కుటుంబాలు ఉండటం విచారకరమని, ఇలాంటి నిరుపేదలకు ప్రభుత్వ భూములను కేటాయించి గృహావసరాలను తీర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భద్రాచలం గ్రామపంచాయతీ పరిధిలోని 20 వార్డుల్లో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి అర్హులైన పేదలకు పంపిణీ చేయాలని కోరారు. భూమి, ఇల్లు వంటి ప్రాథమిక అవసరాలు అందుబాటులోకి రాకపోతే సామాజిక న్యాయం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా, ఏజెన్సీ ప్రాంతాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు మెరుగైన విద్యా సదుపాయాలు, వసతి గృహాలు, స్కాలర్‌షిప్‌లు అందించాలని కోరారు. చదువుకున్న యువతకు స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించే విధానాలు రూపొందించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా,  అమలు కావాలని అన్నారు.
సమావేశంలో పాల్గొన్న నాయకులు దళితుల అభివృద్ధి, సంక్షేమం కోసం సమిష్టిగా కృషి చేయాలని సంకల్పం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు కుషిని శ్యామ్, నాని, భాస్కర్, బర్ల రామకృష్ణ, సామెల్, ఏసు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Tags: