మైనారిటీలపై దాడులు మత ప్రమేయం లేనివే
బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతున్న దాడుల అంశం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైన వేళ, అక్కడి తాత్కాలిక ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
విశ్వంభర బ్యూరో: బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతున్న దాడుల అంశం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైన వేళ, అక్కడి తాత్కాలిక ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. గడిచిన ఏడాది కాలంలో జరిగిన ఘటనల్లో అత్యధికం వ్యక్తిగత కక్షలు లేదా నేరపూరిత స్వభావం కలిగినవే తప్ప, వాటికి మతపరమైన ఉద్దేశాలు లేవని మహమ్మద్ యూనస్ కార్యాలయం స్పష్టం చేసింది.
యూనస్ కార్యాలయం విడుదల చేసిన అధికారిక నివేదిక ప్రకారం.. గతేడాది మైనారిటీలకు సంబంధించి 645 ఘటనలు నమోదయ్యాయి. వీటిలో కేవలం 71 ఘటనలు (అంటే కేవలం 11%) మాత్రమే మతపరమైన కారణాలతో జరిగినట్లు ప్రభుత్వం పేర్కొంది. దేవాలయాల ధ్వంసానికి సంబంధించి 38 కేసులు నమోదయ్యాయి. మతపరమైన 71 ఘటనల్లో 50 కేసులను పోలీసులు నమోదు చేసి, నిందితులను అరెస్ట్ చేశారు. మిగిలిన 21 ఘటనలపై విచారణ సాగుతోందని వెల్లడించింది.
గణాంకాలను తోసిపుచ్చిన హిందూ సంఘాలు
ప్రభుత్వ గణాంకాలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని బంగ్లాదేశ్ హిందూ బుద్ధిస్ట్ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ (BHBCUC) తీవ్రంగా ఖండించింది. ఇలాంటి ప్రకటనలు నేరస్తులకు వత్తాసు పలికేలా ఉన్నాయని, వారికి శిక్ష పడదనే భరోసా కల్పిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది.
ఆందోళనలో హిందూ సమాజం
బంగ్లాదేశ్‌లో హిందువుల రక్షణపై భారత్ నిరంతరం ఒత్తిడి తెస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఈ ఏడాది కేవలం మూడు వారాల వ్యవధిలోనే 10 మందికి పైగా హిందువులు దారుణ హత్యకు గురయ్యారు. నిత్యం ఆలయాల ధ్వంసం, ఆస్తుల లూటీ వంటి వార్తలు మైనారిటీల్లో అభద్రతా భావాన్ని పెంచుతున్నాయి. అన్ని నేరాలను తీవ్రంగా పరిగణిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, పెరుగుతున్న దాడులు మరియు మైనారిటీ సంఘాల ఆందోళనలు అంతర్జాతీయ సమాజాన్ని కలవరపెడుతున్నాయి.



