ఇన్ఫోర్టెకార్ప్ సొల్యూషన్స్ లిమిటెడ్, హనుమాన్ ఇంజినీరింగ్ వర్క్స్ మధ్య కీలక ఒప్పందం
- యూకే–ఇండియా మధ్య ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ తయారీ సహకారాన్ని కొత్త దశకు తీసుకెళ్లేలా
- ఇన్ఫోర్టెకార్ప్ సొల్యూషన్స్ లిమిటెడ్, హనుమాన్ ఇంజినీరింగ్ వర్క్స్ మధ్య కీలక ఒప్పందం
- దుబాయి ఎయిర్‌షో సందర్భంగా అధికారికంగా సంతకం చేసిన కంపెనీల ప్రతినిధులు
- భారతీయ తయారీ రంగానికి ఇది ఒక పెద్ద అవకాశంగా మారబోతోంది
విశ్వంభర,లండన్ : అంతర్జాతీయ ఏరోస్పేస్ మరియు రక్షణ సాంకేతిక రంగంలో ప్రముఖమైన లండన్ ఆధారిత ఇన్ఫోర్టెకార్ప్ సొల్యూషన్స్ లిమిటెడ్, హైదరాబాద్‌కు చెందిన నాలుగు దశాబ్దాల ప్రెసిషన్ ఇంజినీరింగ్ నైపుణ్యాన్ని కలిగిన హనుమాన్ ఇంజినీరింగ్ వర్క్స్ తో ఒక కీలకమైన తయారీ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది.దుబాయి ఎయిర్‌షో సందర్భంగా అధికారికంగా సంతకం చేసిన ఈ ఒప్పందం, యూకే–ఇండియా మధ్య ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ తయారీ సహకారాన్ని కొత్త దశకు తీసుకెళ్లేలా ఉందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.ఈ ఒప్పందం కింద, హనుమాన్ ఇంజినీరింగ్ వర్క్స్ సంస్థ ఇన్ఫోర్టెకార్ప్‌కు ప్రెసిషన్ ఇంజినీరింగ్ భాగాలు, ఏరోస్పేస్ కంపోనెంట్లు, క్రిటికల్ సబ్-సిస్టమ్స్ తయారీ వంటి విభాగాల్లో ప్రధాన భాగస్వామిగా పనిచేయనుంది. అధునాతన టెక్నాలజీ బదిలీ, ప్రక్రియ అభివృద్ధి, నైపుణ్య వృద్ధి వంటి అంశాలు ఈ భాగస్వామ్యానికి ముఖ్య కేంద్రంగా నిలవనున్నాయి.
ఈ సందర్భముగా ఇన్ఫోర్టెకార్ప్ హెడ్ – ఏరోస్పేస్ & డిఫెన్స్ (ఇండియా) రాజు కీరచిపల్లి మాట్లాడుతూ,“ఈ భాగస్వామ్యం భారతదేశంలో అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ సామర్థ్యాలను వేగంగా విస్తరించడానికి కీలకం. మా అంతర్జాతీయ కస్టమర్లకు అత్యుత్తమ నాణ్యతను అందించాలన్న మా దృక్కోణానికి ఇది పూర్తిగా అనుగుణం” అని అన్నారు.
హనుమాన్ ఇంజినీరింగ్ వర్క్స్ డైరెక్టర్ పోడ్‌చంపల్లి సాయి కుమార్ వ్యాఖ్యానిస్తూ,“ఈ ఒప్పందం ద్వారా ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ రంగాల్లో మాకు ఉన్నత స్థాయి తయారీ అవకాశాలు మరింత విస్తరించనున్నాయి. భారతీయ తయారీ రంగానికి ఇది ఒక పెద్ద అవకాశంగా మారబోతోంది” అని తెలిపారు.
సంస్థ వ్యవస్థాపకులు పోడ్‌చంపల్లి అంజనేయులు మాట్లాడుతూ “నాలుగు దశాబ్దాల ఖచ్చితత్వం, విశ్వసనీయతకు చిహ్నంగా నిలిచిన మా సంస్థ ఇప్పుడు ఇన్ఫోర్టెకార్ప్‌తో కలిసి గ్లోబల్ సరఫరా శృంఖలిలోకి ప్రవేశించడం ఒక గొప్ప ముందడుగు. ఇది మాకు మాత్రమే కాకుండా దేశీయ పరిశ్రమకు కూడా గౌరవకరమైన ఘట్టం అని తెలిపారు 



