పబ్లిక్ స్కూళ్ల ను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయాలి

విశ్వంభర, రంగారెడ్డి : ఆరుట్లలో ఏర్పాటు చేసిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ మోడల్‌ను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసి ప్రతి మండలంలో పాఠశాలలు స్థాపించాలి, ఇందుకు రాష్ట్ర బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించాలి అని ఎఐఎస్ఎఫ్ నాయకులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో మోడల్‌గా అభివృద్ధి చేసిన తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను మంగళవారం ఎఐఎస్ఎఫ్ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళీతో పాటు విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కమిటీ సభ్యులతో పలు అంశాలపై చర్చించారు. అనంతరం వారు మాట్లాడుతూ,  ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుని ఆరుట్లలో మోడల్ పాఠశాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. సుమారు ఆరు ఎకరాల్లో నిర్మించిన ఈ పాఠశాలలో ప్రీ ప్రాథమిక స్థాయి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్య అందిస్తున్నట్లు తెలిపారు. బోధనా, బోధనేతర సిబ్బంది, రవాణా సౌకర్యం, ఆట స్థలాలు, గ్రంథాలయం, నాణ్యమైన భోజన సదుపాయం కల్పిస్తూ సమగ్ర విద్యా వాతావరణం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో 1605 మంది విద్యార్థులు చదువుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎఐఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎన్.ఎ.స్టాలిన్, రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ మాట్లాడారు. కార్యక్రమంలో రెహమాన్, గ్యార క్రాంతి, పవన్ చౌహాన్, వంశీవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags: