“ప్రజా పాలన” అమలుపై సమావేశం

“ప్రజా పాలన” అమలుపై సమావేశం

విశ్వంభర, రామన్నపేట: నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని నకిరేకల్ పట్టణంలోని నారాయణ రెడ్డి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన నకిరేకల్ నియోజకవర్గ స్థాయి “ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక” అమలుపై సన్నాహక సమావేశం కార్యక్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, జిల్లా స్థాయి అధికారులు, మున్సిపాలిటీ చైర్మన్లు, సర్పంచులు, కౌన్సిలర్లు మరియు ఇతర ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లలో ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత సమర్థంగా చేరవేయడానికి 99 రోజుల “ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిందని, పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సన్న బియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి పలు సంక్షేమ పథకాలను అందిస్తున్నదని వివరించారు. ఇక అభివృద్ధి కార్యక్రమాల విషయానికి వస్తే, రామన్నపేట మండల కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం చేపడతామని వెల్లడించారు. రేషన్ కార్డు రాని వారు తిరిగి దరఖాస్తు చేసుకుంటే, అర్హులైన వారికి తప్పకుండా కార్డులు మంజూరు చేస్తామని తెలిపారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇండ్లు కేటాయిస్తామని అన్నారు.

Tags: