గోదావరి పుష్కరాలను వైభవంగా నిర్వహిస్తాం

గోదావరి పుష్కరాలను వైభవంగా నిర్వహిస్తాం

  •  మంత్రి  కొండా సురేఖ 

విశ్వంభర,  హైదరాబాద్: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మంగళవారం నాడు 2027 గోదావరి పుష్కరాల నిర్వహణకు సంబంధించిన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ  పాల్గొన్నారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలను భక్తులకు సౌకర్యవంతంగా, భద్రంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా పుష్కర ఘాట్ల అభివృద్ధి, తాగునీరు, పారిశుధ్యం, రవాణా సౌకర్యాలు , ఇతర మౌలిక వసతుల ఏర్పాటుపై ఆయా శాఖల సమన్వయంతో ముందస్తు ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు.సమావేశంలో మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ,  రానున్న గోదావరి పుష్కరాలను ఆధ్యాత్మిక వైభవంతో, భక్తి భావంతో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కొండా సురేఖ  తెలిపారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  మార్గదర్శకత్వంలో పుష్కరాల ఏర్పాట్ల కోసం ప్రత్యేకంగా క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు.దేవాదాయ శాఖ పరంగా గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్న పలు ప్రముఖ దేవాలయాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు.నిజామాబాద్ జిల్లా కందకుర్తి నుంచి భద్రాచలం వరకు గోదావరి నది పరివాహక ప్రాంతంలో బాసర, ధర్మపురి, మంథని, కాళేశ్వరం, భద్రాచలం వంటి అనేక ఆధ్యాత్మిక క్షేత్రాలు ఉన్నాయని పేర్కొన్నారు. పుష్కరాల సమయంలో కోట్లాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. దేవాలయాల వద్ద భక్తులకు అవసరమైన సదుపాయాలు, పారిశుధ్యం, తాగునీరు, భక్తుల రాకపోకల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. గోదావరి నదిని తెలంగాణ గంగా గా భావించే ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాన్ని గౌరవిస్తూ పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో మంత్రులు కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సీతక్క, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, హర్కర వేణుగోపాల్ మరియు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Tags: