సమాచార హక్కు చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి
- జాతీయ చైర్మన్ డాక్టర్ చంటి ముదిరాజ్
విశ్వంభర, హైదరాబాద్ : సమాచార హక్కు చట్టంను తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పోలీస్ స్టేషన్‌లో సమర్థవంతంగా అమలు చేసి, పౌరులు కోరిన సమాచారాన్ని నిర్ణీత గడువులో అందించే విధంగా చర్యలు తీసుకోవాలని జాతీయ చైర్మన్ డాక్టర్ చంటి ముదిరాజ్, రాష్ట్ర అధ్యక్షురాలు సూర స్రవంతి తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ని కోరారు. ఈ మేరకు డీజీపీకి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జాతీయ చైర్మన్ డాక్టర్ చంటి ముదిరాజ్ మాట్లాడుతూ, సమాచార హక్కు చట్టం ప్రభుత్వ పాలనలో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని పెంపొందించడానికి ఎంతో కీలకమని తెలిపారు. 2005లో అమలులోకి వచ్చిన ఈ చట్టం ద్వారా ప్రజలు ప్రభుత్వ పనితీరును తెలుసుకునే హక్కు పొందారని అన్నారు. పన్ను చెల్లింపుదారుల డబ్బు ఎలా ఖర్చు అవుతుందో తెలుసుకునే హక్కు ప్రతి పౌరుడికి ఉందని పేర్కొన్నారు. అలాగే ప్రజలు రేషన్ పంపిణీ, పెన్షన్లు, పౌర సేవలకు సంబంధించిన సమాచారాన్ని ఈ చట్టం ద్వారా పొందగలరని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే సార్వభౌమాధికారులు కాబట్టి, ప్రభుత్వ పనితీరును పర్యవేక్షించేందుకు సమాచార హక్కు చట్టం ఒక శక్తివంతమైన సాధనమని అన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ కార్యదర్శి తోట శ్రీనివాస్ ,రాష్ట్ర కో ఆర్డినేటర్ కొంగంటి రాజ్ కుమార్, రాష్ట్ర కో - కన్వీనర్ గడప కృష్ణ, రాష్ట్ర కార్యదర్శి కడమంచి అజయ్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రకాష్ పటేల్,మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.



