"ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక"ను  దిగ్విజయంగా కొనసాగించాలి

 విశ్వంభర, నిర్మల్ : ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు ప్రజల వద్దకు మరింత మెరుగ్గా చేరవేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు పరుస్తున్న "ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక" కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు అధికారులను ఆదేశించారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అమలుపై అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సిఎస్, హైదరాబాదు నుంచి వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జూమ్ కాల్ ద్వారా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని మరింత పకడ్బందీగా కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులు విజయవంతంగా పూర్తి చేయాలని పేర్కొన్నారు.  అన్ని కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వామ్యం కావాలని తెలిపారు. ఈ నెల 12వ తేదీన, సారంగాపూర్ మండలం చించోలి (బి) గ్రామంలోని ఆదిత్య గార్డెన్స్ లో సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లకు 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం పై అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇదే కార్యక్రమంలో భాగంగా పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలపై ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించి, అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

Tags: