ఫాసిజం పద్ధతులు ప్రజాస్వామ్యానికి ముప్పు

ఫాసిజం పద్ధతులు ప్రజాస్వామ్యానికి ముప్పు

విశ్వంభర, బాగ్ లింగంపల్లి :  ఫాసిజం పద్ధతులను అంగీకరిస్తూ సమాజం ముందుకు సాగితే భవిష్యత్తులో ప్రజాస్వామ్య హక్కులు కూడా కోల్పోయే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాదు బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ 10వ వర్ధంతి సభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర పార్టీ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సభకు రంగయ్య, కె రమ, వి ప్రభాకర్ అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. సభ ప్రారంభంలో రాయల సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫాసిజం ఒక్కసారిగా ఏర్పడదని, క్రమంగా సమాజాన్ని ప్రభావితం చేస్తూ ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టడం, భిన్నాభిప్రాయాలను అణచివేయడం వంటి చర్యలు సమాజానికి ప్రమాదకరమని అన్నారు. భవిష్యత్తులో సభలు నిర్వహించే హక్కు కూడా లేకుండా పోయే పరిస్థితులు తలెత్తవచ్చని హెచ్చరించారు. ప్రపంచంలో పెరుగుతున్న యుద్ధ వాతావరణంపై మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ సామ్రాజ్యవాద ఆధిపత్యం కారణంగా అనేక దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయని అన్నారు. అంతర్జాతీయ రాజకీయ పరిణామాలను ప్రజలు అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఐ వి రమణరావు మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థపై విశ్లేషణ అవసరమని పేర్కొన్నారు. సమాజాన్ని సమగ్రంగా అర్థం చేసుకుని రాజకీయ లక్ష్యాలు రూపొందించుకోవాలని సూచించారు.

Tags: