15న ఫీజుల కోసం పోరు దీక్ష 

15న ఫీజుల కోసం పోరు దీక్ష 

విశ్వంభర, బషీర్ బాగ్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల పరిపాలనలో ఎవరెవరికి ఎంత నిధులు ఖర్చు చేశారో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే శ్వేత పత్రం విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం బషీర్ భాగ్ ప్రెస్ క్లబ్ లో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని, ఈ బడ్జెట్ లో ఫీజులకు పదివేల కోట్లు కేటాయించాలని డిమాండ్ తో ఈనెల 15వ తేదీన హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద చేపట్టనున్న ఫీజు పోరు దీక్ష వాల్ పోస్టర్ ను బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గొడుగు మహేష్ యాదవ్, జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రం గౌడ్ లతో కలిసి జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తాము అధికారంలోకి రాగానే ఫీజులకు బకాయిలను విడుదల చేస్తామని, బీసీ విద్యార్థుల పూర్తి ఫీజులను చెల్లిస్తామని, ఐదు లక్షల రూపాయలతో ప్రతి విద్యార్థికి విద్యార్థి భరోసా కార్డులను అందజేస్తామని నమ్మ బలికిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడిచిన నేటి వరకు అమలు చేయకపోవడం చాలా దురదృష్టకరమన్నారు గత రెండు సంవత్సరాల కాలంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న పేద విద్యార్థులకు ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని రాష్ట్రమంతా విద్యార్థులంతా ఉద్యమిస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం ఖజానా ఖాళీ ఉందని అబద్ధపు మాటలు చెబుతుందన్నారు, ఏడు వేల కోట్లు ఫీజుల బకాయిలు ఇవ్వలేని ప్రభుత్వం గత రెండు సంవత్సరాలుగా బడా కాంట్రాక్టర్లకు 70 వేల కోట్ల రూపాయలను ఎలా ఇచ్చిందని ఆయన ప్రశ్నించారు.గత రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో 3 లక్షల కోట్ల అప్పు చేశారని, తెలంగాణలోని ప్రతి మనిషికి 1,76 వేల రూపాయలు అప్పు రుద్దారని, అప్పు బడుగులపై రుద్ది, సంపద మాత్రం బడా కాంట్రాక్టర్లకు పంచుతున్నారని ఆయన మండిపడ్డారు. ఈ సమావేశంలో బీసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగం గౌడ్, బీసీ మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తారకేశ్వరి, ఉపాధ్యక్షురాలు సంధ్యారాణి, గూడూరు భాస్కర్ మేరు, సత్యం గౌడ్, ఇంద్రమ్ రజక, అనంతుల పవన్ సాయి కుమార్, బండి గారి రాజు, అనంతొజు బ్రహ్మచారి, గోద రవీందర్ రేణుక, విజయలక్ష్మి, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

Tags: