భార్య హత్యకు కుట్ర.. తుపాకీతో భర్త అరెస్ట్

భార్య హత్యకు కుట్ర.. తుపాకీతో భర్త అరెస్ట్

విశ్వంభర, అంబర్‌పేట : భార్యను హత్య చేయాలని కుట్ర పన్నిన వ్యక్తిని అంబర్‌పేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహన తనిఖీల సందర్భంగా దేశీయంగా తయారు చేసిన తుపాకీ, కాకాట్రిడ్జ్ లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అంబర్‌పేట్‌లోని అలి కేఫ్ వద్ద ఈనెల 9వ తేదీ సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో ఎస్‌ఐ ఎన్ అంజి రెడ్డి క్రైమ్ టీమ్ సిబ్బంది పీసీ వంశీ కృష్ణ, పీసీ శ్రీధర్‌తో కలిసి వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్ల రంగు ఎలక్ట్రిక్ వాహనం (టీఎస్ 08 జెహెచ్ 1929)ను ఆపి తనిఖీ చేయగా డిక్కీలో దేశీయంగా తయారు చేసిన తుపాకీ, ఆరు లైవ్ కార్ట్రిడ్జ్‌లు లభ్యమయ్యాయి. వాహనం నడుపుతున్న వ్యక్తి తనను ధమర అరుణ్ కుమార్ (48), రియల్ ఎస్టేట్ వ్యాపారి, మల్కాజిగిరి మారుతి నగర్ నివాసి అని తెలిపాడు. విచారణలో రెండవ భార్య నిషితా రాణిని హత్య చేయాలని కుట్ర పన్నినట్లు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. మల్కాజిగిరికి చెందిన మహమ్మద్ అబ్బు, యాకుత్‌పురకు చెందిన మీర్ ముజమ్మిల్ ఆయుధం సమకూర్చినట్లు విచారణలో బయటపడింది. బీహార్ రాష్ట్రంలోని ముంగేర్ నుంచి దేశీయ తుపాకీ, కార్ట్రిడ్జ్‌లు కొనుగోలు చేసి హైదరాబాదుకు తీసుకొచ్చి అందజేసినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు దేశీయ తుపాకీ, ఆరు లైవ్ కార్ట్రిడ్జ్‌లు, ఎలక్ట్రిక్ వాహనం, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Tags: