భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా చేర్చాలి
విశ్వంభర, జగిత్యాల : 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు భారత రాజ్యాంగాన్ని ప్రత్యేక సబ్జెక్టుగా పాఠ్యాంశాల్లో చేర్చాలని జై భీమ్ మహాశేవా రాష్ట్ర అధ్యక్షుడు బొల్లి స్వామి డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా జగిత్యాల జిల్లా ధర్మారం కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా చేర్చడం ద్వారా పౌరుల హక్కులు, అధికారాల పరిధి, రాజకీయ హక్కులు, హైకోర్టు, సుప్రీంకోర్టు విధులు వంటి అంశాలపై విద్యార్థులకు స్పష్టమైన అవగాహన కలుగుతుందని పేర్కొన్నారు. రాజ్యాంగంలో మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్, ఎనిమిది షెడ్యూళ్లు ఉన్నాయని, ప్రతి పౌరుడికి స్వేచ్ఛ, సమానత్వం, హక్కులు కల్పించేందుకు ఇది మార్గదర్శకంగా నిలుస్తుందని తెలిపారు. డాక్టర్ మాస్టర్ జి, అంజన్న మాట్లాడుతూ రాజ్యాంగంపై ప్రజలకు అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థి దశలోనే రాజ్యాంగంపై పాఠాలు నేర్పితే సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులు తయారవుతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో బాలస్వామి రాష్ట్ర సలహాదారు, ఎస్తేరు రాణి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, మధునమ్మ రాష్ట్ర మాలల ఉపాధ్యక్షురాలు, సురేష్ బాబు జాతీయ కళామండలి అధ్యక్షుడు, బీరుదల లక్ష్మణ్ మాజీ సర్పంచ్, సుంచు మల్లేశం, దేవి రాజలింగయ్య తదితరులు పాల్గొన్నారు.



