మిలియన్ మార్చ్ స్ఫూర్తితో పోరాటం చేస్తాం
విశ్వంభర, మహబూబ్ నగర్ : నియోజకవర్గ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డి క్యాంప్ ఆఫీసులో డబల్ బెడ్ రూమ్ బాధితుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టిఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎం. ఖలీల్ పాల్గొని మాట్లాడుతూ, 2018లో అప్పటి జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోజ్ ఇంటి పట్టా స్థలాలను ప్రభుత్వానికి స్వాధీన పరచాలని పేదలను ఆదేశించారని తెలిపారు. ఇంటి పట్టాలు స్వాధీన పర్చిన వారికి డబల్ బెడ్ రూమ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ హామీని నమ్మి పేదలు తమ ఇంటి స్థలాల పట్టా సర్టిఫికెట్లను మహబూబ్నగర్ అర్బన్ తాసిల్దార్ కార్యాలయంలో అప్పగించారు. ప్రభుత్వ అధికారులు అనేకసార్లు విచారణలు జరిపి డబల్ బెడ్ రూమ్ పొందుటకు అర్హుల జాబితాను రూపొందించారు. మొదటి ప్రాధాన్యతగా జాబితాలో ఉన్న వారందరికీ డబల్ బెడ్ రూమ్ ఇస్తామని అప్పటి కలెక్టర్ మీడియా సమక్షంలో బహిరంగంగా ప్రకటించారు. ఆచరణలో ఆ విధంగా చేయలేదు. అధికారంలో ఉన్న బిఆర్ఎస్ నాయకులకు తలవంచి అర్హులు కాని వారికి డబల్ బెడ్ రూమ్ లు ఇవ్వడం జరిగింది. ఈ డబల్ బెడ్రూంల కేటాయింపుల్లో తీవ్ర అవినీతి జరిగినట్టు మీడియాలో వార్తలు రావడం, కొంతమంది పై కేసులో నమోదయి జైలుకెళ్ళడం, అవినీతికి పాల్పడ్డ అధికారి బంధువు ఒకరు ఆత్మహత్య చేసుకోవడం గతంలో జరిగాయి. తమకు న్యాయంగా రావాల్సిన డబల్ బెడ్ రూమ్ లు ఇవ్వకుండా అన్యాయం చేసినందుకు పేదల ఉసురు తగిలి మాజీ మంత్రి ఎన్నికల్లో ఓడిపోయారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చాక స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి గతంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం రూపొందించిన అర్హుల జాబితాలోని ప్రతి ఒక్కరికి కూడా డబల్ బెడ్రూంలో వచ్చే విధంగా తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఎమ్మెల్యే గారి మాటలను విశ్వసించి రెండు సంవత్సరాలుగా పేదలు తమకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు వస్తాయని ఆశతో ఎదురుచూస్తున్నారు. సర్పంచ్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు ముగిసాయి. మునిసిపల్ ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ జిల్లా జిల్లా అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ డబల్ బెడ్ రూమ్ బాధితులు కలిసి తమకు న్యాయం చేయాలని కోరారు. వారు ఫిబ్రవరి 20 నుండి డబల్ బెడ్ రూమ్ బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. తీరా నూతనంగా ఎన్నుకోబడ్డ కార్పొరేటర్లు తమకు అనుకూలంగా ఉన్నవారికి డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తున్నట్టు పత్రికల్లో, మీడియాలో వార్తలు వస్తున్నాయి. పట్టా సర్టిఫికెట్లు ప్రభుత్వానికి స్వాధీన పరిచిన వారికి డబల్ బెడ్ రూములు ఇవ్వకుండా గత ప్రభుత్వ మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందనే అనుమానంతో ఎమ్మెల్యేని కలవడం కొరకు నేడు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు డబల్ బెడ్ రూమ్ బాధితులు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో పడిగాపులు గాశారు. ఎమ్మెల్యే రానందున బాధితులు అక్కడే సమావేశం ఏర్పాటు చేసుకొని తమకు డబల్ బెడ్ రూమ్ లు ఇవ్వడంలో జాప్యం చేస్తే మిలియన్ మార్చ్ స్ఫూర్తి తో పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిఎఫ్టియు పట్టణ కార్యదర్శి ఎం డి జలాల్ పాషా, డబల్ బెడ్ రూమ్ బాధితులు లలిత,బషీరుద్దీన్, దివ్య,సలీమా బేగం, శ్రీహరి,రాధా, మధులత,నరసింహులు, పారిజాత తదితరులు పాల్గొన్నారు.



