అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడాలి
విశ్వంభర, చిక్కడపల్లి : ప్రపంచ దేశాలను తమ ఆధీనంలో ఉంచుకోవాలనే అమెరికా సామ్రాజ్యవాద విధానాల వల్ల యుద్ధాలు, అశాంతి పెరుగుతున్నాయి, అమెరికా–ఇజ్రాయిల్ కూటమి చర్యలు ప్రపంచ శాంతికి ముప్పుగా మారాయి అని ప్రజా సంఘాల నాయకులు అన్నారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దాడులను ఖండిస్తూ మంగళవారం హైదరాబాదు ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్, కెవిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబు, డివైఎఫ్ఐ రాష్ట్ర నాయకులు కోటా రమేష్, అనగంటి వెంకటేష్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.రజినీకాంత్ మాట్లాడుతూ అమెరికా ఇతర దేశాలపై సైనిక, ఆర్థిక ఆధిపత్యం కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నదని విమర్శించారు.
గాజా–పాలస్తీనా ప్రాంతాల్లో జరుగుతున్న యుద్ధాలు, రష్యా–ఉక్రెయిన్ ఘర్షణలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ పరిస్థితుల కారణంగా భారతదేశ వాణిజ్యానికి, వ్యవసాయ రంగానికి కూడా నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. అమెరికా వాణిజ్య ఒప్పందాలు భారత ప్రజలపై భారంగా మారుతున్నాయని విమర్శించారు. అమెరికా సామ్రాజ్యవాద విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు గళమెత్తాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్.రామ్ నాయక్, ఆశయ్య, మూడ్ శోభనాయక్, విజయ్ కుమార్, రమేష్, నాగేందర్, పాటల గోపి తదితరులు పాల్గొన్నారు.



