టాంజానియాలో నల్గొండ జిల్లా వాసి మృతి - రోదిస్తున్న కుటుంబ సభ్యులు

  టాంజానియాలో నల్గొండ జిల్లా వాసి మృతి - రోదిస్తున్న కుటుంబ సభ్యులు

విశ్వంభర, మునుగోడు: టాంజానియాలో జియాలజిస్టుగా పనిచేస్తున్న తెలంగాణ వాసి గుండెపోటుతో మృతి చెందారు. నల్గొండ జిల్లా మునుగోడు మండలం పలివెల గ్రామానికి చెందిన బడుగు రాజు (38) మూడేళ్ల కిందట టాంజానియా రాజధాని దారుస్సలాం నగరానికి వెళ్లి జియాలాజిస్టుగా పనిచేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్కు వచ్చి నాలుగు నెలల పాటు కుటుంబ సభ్యులతో గడిపి.. రెండు నెలల కిందట తిరిగి టాంజానియా వెళ్లారు. అక్కడ పనిచేస్తున్న క్రమంలో గురువారం రాజుకు గుండెపోటు వచ్చి మృతిచెందినట్లు స్థానికంగా ఉన్న తెలుగు వారు.. పలివెల గ్రామంలో ఉన్న కుటుంబ సభ్యులకు సమాచారాన్ని చేరవేశారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి , శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , మంత్రి శ్రీధర్ బాబుతో.. ఆ దేశ రాయబారితో మాట్లాడించి మృతదేహన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. వారితో పాటు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సైతం తనవంతు ప్రయత్నం చేస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. వారి సహకారంతో రెండు రోజుల్లో పలివెల గ్రామానికి రాజు మృతదేహం చేరుకునే అవకాశం ఉంది. ఉపాధి కోసం వెళ్లిన రాజు త్వరలో తన కుటుంబాన్ని సైతం టాంజానియా తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలిసింది. ఇంతలోనే మృతి చెందడంతో అతని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేక కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతుడికి భార్య, కుమారుడు(10) ఉన్నారు.

Tags: