కరీంనగర్ బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ సందడి నెలకొంది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ.. మొత్తం 66 డివిజన్లకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను అధికారికంగా విడుదల చేసింది.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ సందడి నెలకొంది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ.. మొత్తం 66 డివిజన్లకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను అధికారికంగా విడుదల చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్.గౌతమ్ రావు ఈ పేర్లను ప్రకటించారు. సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని, రిజర్వేషన్ల ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఈ జాబితాలో అధిక ప్రాధాన్యత కల్పించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
అభ్యర్థుల ఖరారు అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు మాట్లాడుతూ.. కరీంనగర్ కార్పొరేషన్‌లో ఈసారి బీజేపీ విజయకేతనం ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పార్టీ బలంగా ఉందని, క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజా వ్యతిరేకత తమకు సానుకూలంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. పార్టీ ప్రకటించిన అభ్యర్థులకు వ్యతిరేకంగా ఎవరైనా రెబల్స్‌గా బరిలోకి దిగితే వారిపై వేటు తప్పదని రాష్ట్ర నాయకత్వం స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. క్రమశిక్షణ తప్పే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, పార్టీ నిర్ణయానికి కట్టుబడి అభ్యర్థుల విజయం కోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు.



