మున్సిపల్ పోరుకు సీఎం రేవంత్ యాక్షన్ ప్లాన్
మున్సిపల్ ఎన్నికల వేడి తారస్థాయికి చేరింది. రాష్ట్ర రాజకీయాలపై నిశిత దృష్టి సారించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తాజాగా పార్టీ అత్యున్నత విభాగమైన పొలిటికల్ అఫైర్స్ కమిటీ (PAC)తో జూమ్ మీటింగ్ నిర్వహించారు.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల వేడి తారస్థాయికి చేరింది. రాష్ట్ర రాజకీయాలపై నిశిత దృష్టి సారించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తాజాగా పార్టీ అత్యున్నత విభాగమైన పొలిటికల్ అఫైర్స్ కమిటీ (PAC)తో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ భేటీలో మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై మంత్రులు, పార్టీ నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ జూమ్ మీటింగ్‌లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు రాష్ట్ర కేబినెట్ మంత్రులు, కీలక నేతలు పాల్గొన్నారు. ఫిబ్రవరి 3 నుంచి సీఎం స్వయంగా ఎన్నికల ప్రచార బరిలోకి దిగనుండటంతో పార్టీలో నూతన ఉత్తేజం కనిపిస్తోంది.
ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. "రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, వివిధ సర్వేల నివేదికలను పరిశీలిస్తే.. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించబోతోంది. మెజారిటీ స్థానాల్లో మన జెండా ఎగరడం ఖాయం" అని ధీమా వ్యక్తం చేశారు. అయితే, గెలుపుపై ధీమాతో ఉండి అశ్రద్ధ వహించవద్దని, ప్రతి వార్డును సవాల్‌గా తీసుకోవాలని హెచ్చరించారు.
ఈ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. టికెట్ల కోసం సిఫారసు చేసే నాయకులే ఆయా అభ్యర్థుల గెలుపుకు పూర్తి బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. అభ్యర్థులకు బి-ఫామ్‌లు అందజేసే బాధ్యతను జిల్లా కాంగ్రెస్ కమిటీలకు అప్పగించారు. రాష్ట్ర స్థాయి పథకాలే కాకుండా, స్థానిక సమస్యలపై దృష్టి సారించి ప్రతి మున్సిపాలిటీకి ప్రత్యేకంగా 'లోకల్ మేనిఫెస్టో' రూపొందించుకుని ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు.
బీసీ రిజర్వేషన్లపై గళమెత్తుదాం
సమావేశంలో ప్రధానంగా బీసీ రిజర్వేషన్ల అంశం చర్చకు వచ్చింది. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు బీసీలకు సముచిత న్యాయం జరగాలని నేతలు కోరారు. దీనిపై స్పందించిన సీఎం.. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని, ఆ దిశగా పార్టీ పోరాటం చేస్తుందని పేర్కొన్నారు.



