భద్రాచలం మీదుగా గంజాయి అక్రమ రవాణా

భద్రాచలం మీదుగా గంజాయి అక్రమ రవాణా

  • 15 కేజీల గంజాయి స్వాధీనం
  • రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు అరెస్ట్

విశ్వంభర, భద్రాచలం: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్,  ఒడిశా రాష్ట్రాల సరిహద్దుగా ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రాంతం గంజాయి అక్రమ రవాణాకు కీలక మార్గంగా మారుతున్న నేపథ్యంలో, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అప్రమత్తతతో కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. అంతర్రాష్ట్ర గంజాయి రవాణాను పూర్తిగా అరికట్టాలనే లక్ష్యంతో, భద్రాచలం పరిధిలో రోజువారీగా వాహన తనిఖీలు నిర్వహిస్తూ అక్రమ రవాణాదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో బుధవారం భద్రాచలం పరిధిలో నిర్వహించిన ప్రత్యేక వాహన తనిఖీల సందర్భంగా ఒక కారు అనుమానాస్పదంగా కదులుతూ కనిపించడంతో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వెంటనే ఆపి తనిఖీలు చేపట్టారు. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తుల ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో వాహనాన్ని పూర్తిగా పరిశీలించగా, కారులో  దాచిన 15 కేజీల గంజాయి బయటపడింది. విచారణలో పట్టుబడిన ఇద్దరు వ్యక్తులు రాజస్థాన్ రాష్ట్రానికి చెందినవారిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వారు ఒడిశా రాష్ట్రం మల్కనగిరి ప్రాంతం నుంచి గంజాయిని సేకరించి, భద్రాచలం మీదుగా హైదరాబాదు నగరానికి అక్రమంగా తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అంతర్రాష్ట్ర గంజాయి రవాణా నెట్‌వర్క్‌లో భాగంగా ఈ అక్రమ కార్యకలాపాలు సాగుతున్నాయని అధికారులు అనుమానిస్తున్నారు. గంజాయి అక్రమ రవాణాకు వినియోగించిన కారుతోపాటు 15 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, గంజాయి తరలిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు. నిందితులను కోర్టుకు హాజరుపరిచే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.
భద్రాచలం, చుట్టుపక్కల సరిహద్దు ప్రాంతాల్లో గంజాయి అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు, రానున్న రోజుల్లో వాహన తనిఖీలు మరింత కఠినంగా నిర్వహిస్తామని, అంతర్రాష్ట్ర అక్రమ రవాణాదారులపై ఎటువంటి ఉపేక్ష ఉండదని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్పష్టంచేశారు. ప్రజలు కూడా అనుమానాస్పద కార్యకలాపాలపై సమాచారం అందించి సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.

Tags: