ఇరాన్‌ దిశగా అమెరికా సైన్యం

ఇరాన్‌ దిశగా అమెరికా సైన్యం

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ, ఇరాన్‌ పాలకులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి అల్టిమేటం జారీ చేశారు.

విశ్వంభర బ్యూరో: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ, ఇరాన్‌ పాలకులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి అల్టిమేటం జారీ చేశారు. ఇరాన్ చుట్టూ ఇప్పటికే అమెరికా తన భారీ నౌకాదళాన్ని మోహరించిందని, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యం ఆ దేశం వైపు కదులుతోందని హెచ్చరించారు. శ్వేతసౌధంలో జరిగిన విలేకరుల సమావేశంలో ట్రంప్‌ మాట్లాడుతూ.. ఇరాన్ తాజా పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వందలాది మంది నిరసనకారులకు విధించిన ఉరిశిక్షల అంశంపై ట్రంప్‌ స్పందించారు. "నేను రంగంలోకి దిగకపోయి ఉంటే ఇప్పటికే 800 మందికి పైగా నిరసనకారులను ఇరాన్ ఉరితీసేది. వారిని ఉరితీస్తే అమెరికా నుంచి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నేను హెచ్చరించడంతోనే ఇరాన్ పాలకవర్గం వెనక్కి తగ్గింది" అని ట్రంప్ పునరుద్ఘాటించారు. ఇరాన్‌కు నష్టం జరగకూడదని తాను భావిస్తున్నప్పటికీ, పరిస్థితులు చేయి దాటితే చర్యలు తప్పవని ట్రంప్ స్పష్టం చేశారు.

పశ్చిమాసియాకు అమెరికా అతిపెద్ద విమాన వాహక నౌక ‘యూఎస్ఎస్ అబ్రహం లింకన్’ సహా పలు యుద్ధనౌకలు చేరుకుంటున్నాయి. దాడులను తిప్పికొట్టేందుకు అదనపు వైమానిక రక్షణ వ్యవస్థలను కూడా వైట్‌హౌస్ ఆ ప్రాంతానికి పంపిస్తోంది. ఇరాన్‌ నుంచి ఎదురయ్యే ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు వీలుగా ఈ భారీ మోహరింపు జరుగుతోందని అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. 

Read More మార్షల్ ఆర్ట్స్‌లో అరుదైన ఘనత.. పవన్ కళ్యాణ్ సరికొత్త రికార్డ్..!!