వివేకా హత్య కేసులో సునీత మరో అప్లికేషన్‌

ట్రయల్ కోర్టు ఆదేశాలపై అసంతృప్తి

వివేకా హత్య కేసులో సునీత మరో అప్లికేషన్‌

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు తీరుపై ఆయన కుమార్తె సునీతారెడ్డి మరోసారి దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సీబీఐ విచారణ కొనసాగింపుపై హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టు (ట్రయల్ కోర్టు) ఇటీవల ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఆమె సుప్రీంకోర్టులో అప్లికేషన్ దాఖలు చేశారు.

విశ్వంభర, ఏపీ బ్యూరో: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు తీరుపై ఆయన కుమార్తె సునీతారెడ్డి మరోసారి దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సీబీఐ విచారణ కొనసాగింపుపై హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టు (ట్రయల్ కోర్టు) ఇటీవల ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఆమె సుప్రీంకోర్టులో అప్లికేషన్ దాఖలు చేశారు.

సీబీఐ దర్యాప్తు కొనసాగింపుపై నిర్ణయం తీసుకోవాలని గతంలో సుప్రీంకోర్టు హైదరాబాద్ సీబీఐ కోర్టును ఆదేశించింది. జస్టిస్ సుందరేశ్ ధర్మాసనం ఈ ప్రక్రియను మూడు నెలల్లోగా పూర్తి చేయాలని స్పష్టమైన గడువు విధించింది. అయితే, ట్రయల్ కోర్టు కేవలం ఇద్దరి పాత్రపై మాత్రమే విచారణ జరపాలని పాక్షికంగా ఆదేశాలు ఇవ్వడాన్ని సునీత తప్పుబట్టారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన మార్గదర్శకాలను ట్రయల్ కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని, తాము లేవనెత్తిన కీలక అంశాలను విస్మరించిందని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. హత్య వెనుక ఉన్న అసలు కుట్ర కోణాన్ని ఛేదించాలంటే పూర్తిస్థాయి దర్యాప్తు అవసరమని, కేవలం ఇద్దరికే విచారణను పరిమితం చేయడం వల్ల అసలు దోషులు తప్పించుకునే అవకాశం ఉందనిపేర్కొన్నారు. సునీతారెడ్డి దాఖలు చేసిన ఈ తాజా దరఖాస్తుతో పాటు ఈ కేసులో పెండింగ్‌లో ఉన్న అన్ని పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.

Read More దావోస్‌కు ఏపీ సీఎం చంద్రబాబు

వివేకా హత్య కేసులో ఇప్పటికే పలువురు నిందితులు జైలులో ఉండగా, హత్య వెనుక ఉన్న సూత్రధారులు ఎవరన్న దానిపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో దర్యాప్తును కేవలం ఇద్దరికే పరిమితం చేస్తే, కేసులో ఉన్న ఇతర ప్రభావవంతమైన వ్యక్తుల పాత్ర బయటకు రాదని బాధితులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే సునీతారెడ్డి సీబీఐకి పూర్తిస్థాయి విచారణాధికారం ఇవ్వాలని కోరుతున్నారు.