25 తర్వాత రాజకీయ రంగ ప్రవేశం: విజయసాయిరెడ్డి
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ విచారణ ఎదుర్కొన్న వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన నిజాలను బయటపెట్టారు.
విశ్వంభర, ఏపీ బ్యూరో: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ విచారణ ఎదుర్కొన్న వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన నిజాలను బయటపెట్టారు. పార్టీలో తన ప్రాధాన్యత, జగన్‌తో ఉన్న సంబంధాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.లిక్కర్ స్కామ్ గురించి తనకేమీ తెలియదని ఈడీ అధికారులకు స్పష్టంగా చెప్పానని అన్నారు. వైసీపీలో నంబర్ 2 స్థానంలో ఉన్న మీకు ఈ విషయం తెలియకపోవడమేంటని వారు ప్రశ్నించారు. దానికి సమాధానంగా.. స్వయంగా జగన్ గారే తనను నంబర్ 2 అని చెప్పారని వారికి వివరించాను. కానీ, వాస్తవానికి కేసుల విషయంలోనే తాను నంబర్ 2 అని వ్యాఖ్యానించారు. లాభాల విషయానికి వస్తే వంద స్థానాల తర్వాత కూడా తాను ఉండనని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రభుత్వం తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, సంబంధం లేని కేసుల్లో ఇరికిస్తోందని ఆయన ఆరోపించారు. తాను రాజకీయాల నుండి తప్పుకోలేదని స్పష్టం చేస్తూ.. ఈ నెల 25 తర్వాత తన అసలు రాజకీయ రంగ ప్రవేశం ఉంటుందని విజయసాయిరెడ్డి సంకేతాలిచ్చారు.
జగన్ మనసులో 'వెన్నుపోటు' భయం!
2018 వరకు జగన్ మనసులో తనకు ప్రత్యేక స్థానం ఉండేదని, కానీ అధికారంలోకి వచ్చాక ఒక 'కోటరీ' తనను పక్కన పెట్టిందని విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.ఎన్టీఆర్‌ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచినట్లు, తాను కూడా జగన్‌ను వెన్నుపోటు పొడుస్తాననే భయాన్ని ఆయనలో కల్పించారని.. అందుకే తనను సైడ్ చేస్తూ వచ్చారని పేర్కొన్నారు. మీడియా, వైసీపీ సోషల్ మీడియా మాత్రమే తనను నంబర్ 2గా చూపిస్తున్నాయని.. అంతర్గతంగా పరిస్థితి వేరని వివరించారు.
కూటమి విడిపోతేనే జగన్‌కు ఛాన్స్
రాష్ట్ర రాజకీయ పరిణామాలపై స్పందిస్తూ.. ప్రస్తుత కూటమి (టీడీపీ-జనసేన-బీజేపీ) బలంగా ఉన్నంత కాలం జగన్ అధికారంలోకి రావడం అసాధ్యమని విజయసాయిరెడ్డి కుండబద్దలు కొట్టారు. కూటమి విడిపోతేనే జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. జగన్ కూడా 20 ఏళ్లు ఉంటామనుకున్నారు.. ఇప్పుడు చంద్రబాబు కూడా 25 ఏళ్లు ఉంటానని భావిస్తున్నారు. కానీ ఏదీ శాశ్వతం కాదని వ్యాఖ్యానించారు.



