ముత్తంగిలో రోడ్డు ఆక్రమణ

ముత్తంగిలో రోడ్డు ఆక్రమణ

  • జిహెచ్‌ఎంసి అధికారుల మౌనం
  • ఎమ్మెల్యే శంకుస్థాపన చేసిన రోడ్డుకే ఎసరు

విశ్వంభర,  ముత్తంగి : సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ముత్తంగి ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఇటీవల ముత్తంగి గ్రామం జిహెచ్‌ఎంసి  పరిధిలోకి విలీనమైనప్పటికీ, క్షేత్రస్థాయిలో నిఘా లోపించడంతో ఆక్రమణదారులు రెచ్చిపోతున్నారు. స్మశానవాటిక నుండి డి.ఎన్. కాలనీకి వెళ్లే ప్రధాన రహదారిని ఆక్రమిస్తూ కొందరు వ్యక్తులు బేస్మెంట్ నిర్మాణం చేపట్టడం స్థానికంగా కలకలం రేపుతోంది. స్థానికుల వివరాల ప్రకారం, గతంలో ఇదే ప్రదేశంలో రోడ్డును ఆక్రమించి నిర్మాణం చేపట్టగా, అప్పటి పంచాయతీ ఈఓ దృష్టికి తీసుకెళ్లడంతో సిబ్బంది జేసీబీతో ఆ అడ్డంకులను తొలగించారు. అయితే, ముత్తంగి జిహెచ్‌ఎంసిలో విలీనం కావడంతో పర్యవేక్షణ తగ్గుతుందని భావించిన ఆక్రమణదారులు, తాజాగా మళ్లీ అదే స్థలంలో పనులు ప్రారంభించారు. కేవలం 15 రోజుల క్రితమే స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఈ రోడ్డుపై సీసీ రోడ్ పనులకు శంకుస్థాపన చేశారు. ఒకవైపు ప్రభుత్వ పనులు ప్రారంభం కావాల్సి ఉండగా, మరోవైపు రోడ్డును ఆక్రమిస్తూ బేస్మెంట్ కట్టడం వెనుక అధికారుల అండదండలు ఉన్నాయా? అని కాలనీ వాసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జిహెచ్‌ఎంసి నిబంధనల ప్రకారం రోడ్ల విస్తరణ జరగాల్సి ఉండగా, ఉన్న రోడ్డునే కబ్జా చేస్తుంటే అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారని వారు ప్రశ్నిస్తున్నారు.ఈ అక్రమ నిర్మాణంపై అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.తక్షణమే జిహెచ్‌ఎంసి ఉన్నతాధికారులు స్పందించి అక్రమ కట్టడాలను నిలిపివేసి, రోడ్డును ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు.

Tags: