మహిళలు అన్నిరంగాలలో రాణించాలి
- కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
విశ్వంభర, సూర్యాపేట: మహిళలు అన్ని రంగాలలో రాణించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మంగళవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు, జిల్లా ఎస్పీ కే నరసింహ, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సీతారామారావు తో కలిసి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో రాణించాలని, అందరికీ ఆదర్శంగా ఉన్నత స్థానానికి ఎదగాలని, ప్రతి మహిళ సాటి మహిళకు అండగా నిలబడాలని తెలిపారు. మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజం ఆరోగ్యవంతంగా ఉంటుందని, ప్రతి మహిళ జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్న వారేనని తెలిపారు. మహిళలు విద్య, విజ్ఞానం, సాంకేతికత, ఉద్యోగం, వ్యాపారం వంటి ప్రతి రంగంలో ప్రతిభను చాటుతూ దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని కలెక్టర్ పేర్కొన్నారు. మహిళ సాధికారత దేశ అభివృద్ధికి పునాది అని తెలిపారు. కుటుంబం నుంచి సమాజం వరకు ప్రతి స్థాయిలో మహిళల పాత్ర అపారమని, మహిళలకు మరిన్ని విస్తృతంగా అవకాశాలు కల్పిస్తే దేశ ప్రగతి మరింత వేగంగా సాగుతుందని అన్నారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని మున్సిపాలిటీలలో మహిళల ప్రాధాన్యత పెరిగినదని, మహిళల రక్షణకు ప్రభుత్వం అనేక చట్టాలు తీసుకొచ్చినదని మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ ఏర్పాటు చేయనైనదని మహిళలు అన్ని రంగాలలో ధైర్యంగా ముందుకు వెళ్లాలని ఎస్పి అన్నారు. అనంతరం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా మహిళల అధికారులను శాలువులతో సన్మానించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి , మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత, కోదాడ డిప్యూటీ చైర్ పర్సన్ మల్లీశ్వరి, డిప్యూటీ సీఈఓ శిరీష, పంచాయతీరాజ్ ఇ ఇ రమాదేవి, ఎస్సీ సంక్షేమ అధికారి దయానంద రాణి, డిఎంహెచ్వో వెంకటరమణ, డిటిఓ రవికుమార్, సీడబ్ల్యూసీ సభ్యులు , సీడీపీవోలు, సూపర్వైజర్లు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.



