కబ్జా నుంచి పార్కును కాపాడిన హైడ్రా
విశ్వంభర, శేరిలింగంపల్లి : చందానగర్ పరిధిలో ఆక్రమణకు గురైన పార్కు స్థలానికి ఫెన్సింగ్ ఏర్పాటు చేసిన హైడ్రా అధికారులు. శేరిలింగంపల్లి మండలం చందానగర్ పరిధిలోని భవానీపురం కాలనీలో ఆక్రమణకు గురవుతున్న పార్కు స్థలాన్ని హైడ్రా అధికారులు రక్షించారు. కాలనీలోని సుమారు 400 గజాల పార్కు స్థలాన్ని కొందరు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని భవానీపురం కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దీనిపై హైడ్రా అధికారులు జీహెచ్ ఎంసీ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గతంలో జీహెచ్ ఎంసీ అధికారులు పార్కు చుట్టూ ప్రహరీ నిర్మించి హద్దులు నిర్ధారించినట్లు గుర్తించారు. ఆ ప్రహరీనే పునాదిగా చేసుకుని ఇల్లు నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడైంది. లేఅవుట్ ప్రకారం స్థలాన్ని పార్కుగా నిర్ధారించిన అధికారులు మంగళవారం ఆక్రమణలను తొలగించి సుమారు 400 గజాల స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. పార్కు స్థలమని సూచిస్తూ బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. ఈ స్థల విలువ సుమారు రెండు కోట్ల రూపాయల వరకు ఉంటుందని స్థానికులు అంచనా వేస్తున్నారు. పార్కును కాపాడిన హైడ్రా అధికారులకు కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు.



