భక్తాంజనేయ ఆలయంలో చైర్ పర్సన్ పూజలు
విశ్వంభర, సూర్యాపేట: హనుమంతుడు అసాధారణమైన బలం, అచంచలమైన భక్తి, ధైర్యం, ఓర్పు , నిస్వార్థ సేవ వంటి లక్షణాల సమాహారం అని, భక్తులకు రక్షణ కల్పించే దైవం హనుమంతుడని సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ మోరిశెట్టి నివేదిత లక్ష్యాది తెలిపారు. మంగళ వారం మున్సిపల్ చైర్పర్సన్ గా ప్రమాణ స్వీకారం అనంతరం మొట్టమొదటిసారిగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం లో దేవాలయ ఫౌండర్ కొత్త ఆంజనేయులు పిలుపు మేరకు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు మున్సిపల్ చైర్ పర్సన్ దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంజనేయస్వామి దేవాలయం లేని ఊరు ఉండదు అన్నారు. ఆంజనేయస్వామి గొప్ప యోధుడు,విద్యావంతుడు, ధర్మపరుడు అని,శ్రీరామ చంద్రుడికి నమ్మిన బంటుగా ఉంటూ విశ్వాసానికి ప్రతీకగా వారు నిలిచారని గుర్తు చేశారు. స్వామిని ఆరాధించి వారి ఆశయాలను పాటించాల్సిన ఆధ్యాత్మిక చింతన భక్తులకు ఎంతో అవసరమని చైర్మన్ సూచించారు. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయాన్ని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతమన్నారు. కోరిన కోరికలు తీర్చే శ్రీ భక్తాంజనేయ స్వామి సూర్యాపేట ప్రజలందరినీ చల్లగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ గండూరి రమేష్ దేవాలయ అర్చకులు ధరూరి రామానుజాచార్యులు, ధరూరు శ్రీధరాచార్యులు, మాజీ ధర్మకర్త పబ్బా రామమూర్తి, కొత్త రజిని, దేవాలయ క్లర్క్ దేవేంద్ర చారి తదితరులు పాల్గొన్నారు.



