తప్పు లేకుంటే ఎందుకు పారిపోతున్నారు?

 తప్పు లేకుంటే ఎందుకు పారిపోతున్నారు?

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మహిళా ఐఏఎస్ అధికారిణి కేసులో ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ రిపోర్టర్ల అరెస్టులపై సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు చేశారు.

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మహిళా ఐఏఎస్ అధికారిణి కేసులో ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ రిపోర్టర్ల అరెస్టులపై సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిందితులు విచారణకు సహకరించకపోగా, దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నించడం వల్లే అదుపులోకి తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించారు. నిందితులు నిజంగా సక్రమంగా ఉంటే విచారణకు ఎందుకు భయపడుతున్నారు అని ప్రశ్నించారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న సమయంలో రాత్రికి రాత్రే బ్యాంకాక్ పేరుతో దేశం విడిచి పారిపోయే ప్రయత్నం చేస్తే పట్టుకోకుండా ఎలా ఉంటామని నిలదీశారు. సదరు ఛానల్ సీఈవో ప్రస్తుతం ఎక్కడ ఉన్నారని, విచారణకు పిలిస్తే ఎందుకు పారిపోతున్నారని సజ్జనార్ అడిగారు. విచారణకు వస్తానని చెప్పి సెల్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకుని తప్పించుకోవడం దర్యాప్తునకు ఆటంకం కలిగించడమేనని పేర్కొన్నారు. నోటీసులు ఇవ్వకుండా అరెస్టులు ఎలా చేస్తారన్న విమర్శలపై సీపీ సజ్జనార్ స్పందించారు. సిట్ (SIT) అంటేనే ప్రత్యేక దర్యాప్తు బృందమని అన్నారు. దర్యాప్తులో భాగంగా ఆధారాలు ఉంటే అదుపులోకి తీసుకుంటామని చెప్పారు.తప్పు చేసిన వారు ఎవరైనా సరే.. చట్టం ముందు ప్రవేశపెడతామని స్పష్టం చేశారు.

ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక మహిళా అధికారినిపై అసత్య కథనాలు ప్రసారం చేయడం అత్యంత దారుణమని సీపీ అభిప్రాయపడ్డారు. విచారణకు సహకరించకుంటే ఇళ్లకు వెళ్లైనా నిందితులను పట్టుకొస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం రిపోర్టర్ల నుంచి కీలక వివరాలు సేకరిస్తున్నామని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. ఆధారాలతో సహా నిరూపితమైన తర్వాతే చర్యలు తీసుకుంటున్నామని సజ్జనార్ స్పష్టం చేశారు.

Read More తెలంగాణ మున్సిపల్ బరిలో 'జనసేన'