తెలంగాణ మున్సిపల్ బరిలో 'జనసేన'

తెలంగాణ మున్సిపల్ బరిలో 'జనసేన'

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించింది. 

విశ్వంభర, బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నగారా మోగకముందే రాజకీయ వాతావరణం వేడెక్కింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ అధిష్టానం ఇప్పటికే కార్యాచరణను సిద్ధం చేసి, క్షేత్రస్థాయి శ్రేణులకు దిశానిర్దేశం చేసింది. ఎన్నికల షెడ్యూల్ వెలువడేందుకు తక్కువ సమయం ఉన్నప్పటికీ, వెనకడుగు వేయకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రధాన మున్సిపాలిటీల్లో గరిష్ట స్థాయిలో అభ్యర్థులను బరిలోకి దింపాలని పార్టీ భావిస్తోంది. తెలంగాణలో సరికొత్త రాజకీయ ప్రత్యామ్నాయంగా ఎదగడానికి, ఒక  బలమైన రాజకీయ పునాది వేయడమే లక్ష్యంగా జనసేన ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న జన సైనికులు, వీర మహిళలు ఈ ఎన్నికల సమరంలో చురుగ్గా పాల్గొనాలని పార్టీ పిలుపునిచ్చింది. ప్రతి వార్డులోనూ పార్టీ జెండాను ఎగురవేయాలని.. స్థానిక సమస్యలనే అజెండాగా ప్రజల్లోకి వెళ్లాలని.. పార్టీ బలోపేతం కోసం క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని హోరెత్తించాలని సూచించింది.