ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో సీఎం ఫ్లెక్సీ ఏర్పాటుచేస్తాం
విశ్వంభర, సిద్దిపేట: ప్రజాధనంతో నిర్మించిన సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీ, ఫొటోలను ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రజలకిచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారని చెప్పారు. ఓర్వలేక కొండం సంపత్ రెడ్డి లాంటి బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఎలాంటి అర్హత లేని సంపత్ రెడ్డి ప్రజాపాలన 99రోజుల ప్రణాళిక ఫ్లెక్సీని చింపేయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. నిరసనగా శుక్రవారం కాంగ్రెస్ ప్రభుత్వ ఫ్లెక్సీని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజలు కర్రు కాల్చి వాతపెట్టిన బీఆర్ఎస్ నాయకులకు బుద్ధి రాలేదని ఎద్దేవా చేశారు. జిల్లా కేంద్రంలోని హౌజింగ్ బోర్డు 1340 సర్వేనంబర్‌లో కొండం సంపత్ రెడ్డి భూకబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. సమావేశంలో దాస అంజయ్య, మార్క సతీష్, భిక్షపతి, అర్షద్, హుస్సేన్, వాహాబ్, అజ్మత్, ఖాయజుద్దీన్, చోటాస్మత్ అక్బర్, విజయ డానియల్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.



