ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
- ఎస్పీ నరసింహ
విశ్వంభర, సూర్యాపేట: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా చివ్వెంల మండలం తిరుమలగిరి గ్రామంలో నిర్వహించిన గ్రామసభ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నరసింహ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా గ్రామ పరిపాలన అధికారులు, గ్రామ ప్రజాప్రతినిధులు గ్రామం యొక్క అభివృద్ధి, గ్రామ చరిత్ర, ప్రభుత్వ పథకాలు, లబ్ధిదారుల వివరాలు, ప్రజా సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని గ్రామ అభివృద్ధికి ప్రజలు భాగస్వామ్యం కావాలని గ్రామసభ నిర్వహణ అధికారులు గ్రామస్తులకు వివరించారు. అనంతరం జిల్లా పోలీస్ శాఖ రూపొందించిన అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత అవగాహన ఉద్యమ కరపత్రాలను గ్రామస్తులతో కలిసి జిల్లా ఎస్పీ ఆవిష్కరించారు. రోడ్డు నియమ నిబంధనలు, ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుపుతూ రూపొందించిన కరపత్రాలను గ్రామస్తులకు, విద్యార్థులకు యువతకు, అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి పరణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈరోజు గ్రామంలో గ్రామ సభ నిర్వహించడం జరిగిందని ఈ గ్రామసభ గ్రామ అభివృద్ధికి దిక్సూచిగా ఉంటుందని తెలిపారు. గ్రామాభివృద్ధికి కావలసిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వాటి ప్రయోజనాలను క్రింది స్థాయి గ్రామస్తుల వరకు ప్రతి పేదకు, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ అందాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్టంగా పనిచేస్తున్నామని, ప్రజల రక్షణలో నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. పోలీసులు ఉన్నది ప్రజల రక్షణ కోసమేనని మంచివారికి మిత్రులుగాను చెడ్డవారి పట్ల చట్టాన్ని అమలు చేసే వారిగాను ఉంటామని అన్నారు. ప్రజలు శాంతి సామరస్యాలతో ఉండాలని గ్రామాలలో చిన్న చిన్న సమస్యలకు గొడవలు పెట్టుకోవడం దాడులు చేసుకోవడం చేసుకోవద్దని తెలిపారు, సమస్యలను సామరస్యంగా పెద్దమనుషుల సమక్షంలో చట్ట పరిధిలో పరిష్కరించుకోవాలని కోరారు. సామాజిక అంశాల గురించి సామాజిక భద్రత గురించి పౌరుల సత్ప్రవర్తన గురించి చట్టాల అమలు గురించి జిల్లాలో పోలీసు ప్రజా భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించి సుమారు 300కు పైగా గ్రామాలలో గ్రామస్తులను చైతన్యపరిచామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, స్థానిక ఎస్సై మహేష్, గ్రామ సర్పంచ్ నగేష్, ఉప సర్పంచ్ వెంక రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ నరసింహ చారి, వార్డు సభ్యులు, గ్రామ స్పెషల్ ఆఫీసర్ దయాకర్, గ్రామ కార్యదర్శి కవిత, హౌసింగ్ ఏఈ ప్రేమలత, మెడికల్ ఆఫీసర్ మణికంఠ, గ్రామ పోలీసు అధికారి కృష్ణయ్య, గ్రామ పౌరులు, గ్రామ పెద్దలు, యువత, విద్యార్థులు పాల్గొన్నారు.



