సిద్దిపేటలో సీఎం ఒరగబెట్టిందేమీ లేదు
విశ్వంభర, సిద్దిపేట: సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేటకు వచ్చి ఒరగబెట్టింది ఏమీ లేదని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణ శర్మ, మున్సిపల్ మాజీ ఛైర్మన్ రాజనర్సు అన్నారు. సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో సీనియర్ నాయకులు గుండు భూపేష్, కూర మాణిక్య రెడ్డి, జాప శ్రీకాంత్ రెడ్డి, సారయ్య, ఎల్లారెడ్డి, లింగం గౌడ్, సోమిరెడ్డి చిన్నాలతో కలసి సోమవారం మీడియాతో మాట్లాడారు. 300ఎకరాలకు 62ఎకరాలకు తేడా తెలియని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎలా అయ్యారో అర్థం కావడం లేదన్నారు. కలెక్టరేట్ పక్కన వెటర్నరీ కాలేజీ కోసం వేసిన పిల్లర్లు సీఎం రేవంత్ రెడ్డి రాకను వెక్కిరిస్తున్నాయని ఎద్దేవా చేశారు. సిద్దిపేటకు సంబంధించిన పలు అభివృద్ధి పనులకు గతంలో రూ.1070 కోట్లు పనులు మంజూరు కాగా, రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత వాటిని కొడంగల్‌కు తరిలించుకపోవడం సిగ్గుచేటు అన్నారు. నర్మెట్ట ఆయిల్‌ఫామ్ సభలో సీఎం పచ్చి అబద్దాలు మాట్లాడారని, అబద్ధాలపై అంబేద్కర్ సర్కిల్‌లో చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి తన స్థాయిని దిగజార్చుకుని రాజకీయాలు చేస్తున్నారన్నారు. సమావేశంలో నేతలు మోహన్ లాల్, పూజల వెంకటేశ్వర్ రావు, ఆంజనేయులు, రెడ్డి ప్రభాకర్, మెరుగు మహేష్, అజిజ్, రాజేందర్, రామరాజు తదితరులు పాల్గొన్నారు.



