గ్రామసభలు విజయవంతం

గ్రామసభలు విజయవంతం

విశ్వంభర, సిద్దిపేట: ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యాచరణలో భాగంగా నారాయణరావుపేట మండలంలోని 11గ్రామాల్లో గ్రామసభలను సర్పంచ్‌లు గురువారం విజయవంతంగా నిర్వహించారు. గుర్రాలగొంది గ్రామంలో సర్పంచ్ ఆకుల స్వప్న హరీశ్ అధ్యక్షతన జరిగిన గ్రామసభకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్ కమిషనర్ విజయరావు, జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, పంచాయతీ అధికారి రవీందర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రైతుభరోసా, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500లకే సబ్సిడీ గ్యాస్ సిలిండర్, గృహజ్యోతిలో 200యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, సన్నరకం వడ్లకు బోనస్, చేయూత పింఛన్లు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఇందిరా మహిళా శక్తి పథకం కింద ఎస్‌హెచ్‌జీలకు బ్యాంకు లింకేజీ, వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీరలు, కొత్త రేషన్ కార్డు మొదలైన పథకాల గురించి గ్రామసభలో శాఖల వారీగా అధికారులు చదివి వినిపించారు. ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టే ప్రీ ప్రైమరీ అల్పాహార పథకం నుంచి ఇంటర్మీడియట్ వరకు, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా, ఇంటర్ చదివే విద్యార్థులకు మోటారైజ్డ్ వాహనాలు అందించడం, పంటల వైవిధ్యకరణ, సేంద్రియ వ్యవసాయం గురించి వివరించారు. అనంతరం పంచాయతీరాజ్ జాయింట్ కమిషనర్ విజయరావు మాట్లాడుతూ ప్రభుత్వం పథకాలను ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెడుతుందని, అర్హులందరూ వినియోగించుకోవాలని తెలిపారు. అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ మాట్లాడుతూ మిగిలిన అర్హులను గుర్తించి వారికి ఆయా పథకాలను అందించాలని ఆదేశించారు. గ్రామసభ సమావేశంలో నారాయణరావుపేట ఎంపీడీవో శ్రీనివాసరావు, తహశీల్దార్ జయంత్, పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, అధికారులు, లబ్ధిదారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Tags: