విద్యార్థులకు పుస్తకాల పంపిణీ
విశ్వంభర, ముషీరాబాదు : జాతీయ జెండా ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య సేవలను గుర్తుచేసుకుంటూ పాఠశాల విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం గర్వకారణమని కోడూరు శ్రీదేవి, కోడూరు శ్యామలరావు తెలిపారు. ఈ సందర్భంగా జాతీయ జెండా ప్రాముఖ్యతను యువతకు తెలియజేయడం, ఆయనకు భారతరత్న ఇవ్వాలని ప్రభుత్వాలను కోరడం కార్యక్రమం ప్రత్యేకతగా నిలిచిందన్నారు. హైదరాబాదు అడిక్‌మెట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్ ప్రధాన కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ గోవింద అశోక్ ముఖ్య అతిథిగా పాల్గొని 300 మంది పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పింగళి వెంకయ్య సేవలను కొనియాడుతూ భారతరత్న ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. దాతలు ఐత సత్యం, లక్కరాజు సురేష్ కార్యక్రమాన్ని అభినందించారు. సభలో జీఎం కేశవ్, రొయ్యూరు శేష సాయి, మేడి సత్యనారాయణ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కోడూరు శ్యామలరావు, బంగారు ప్రశాంత్, సుధాకర్ రెడ్డి, కరణం సురేష్, విజయ్ యాదవ్, పి లక్ష్మణ్, కె వెంకటేష్, కె శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.



