ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ఘనంగా వార్డు సభలు
విశ్వంభర, సంగారెడ్డి: ఇస్నాపూర్ పురపాలక సంఘం పరిధిలో 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' 99 రోజుల కార్యచరణలో భాగంగా గురువారం అన్ని వార్డుల్లో వార్డు సభలను అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 26 వార్డులను కవర్ చేస్తూ మున్సిపల్ కార్యాలయం, రామాలయం ప్రాంగణం, రుద్రారం, లక్డారం మరియు చిట్కుల్ వార్డు కార్యాలయాల వద్ద ఈ సభలు జరిగాయి. గత కొంతకాలంగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల వివరాలను 'ప్రగతి సూచికల నివేదిక' రూపంలో ప్రజలకు వివరించారు.వార్డుల వారీగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాలు అర్హులకు ఏ విధంగా అందుతాయనే అంశంపై ప్రత్యేక అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ మోటే సుమలత మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్దేశించిన 99 రోజుల ప్రణాళిక ద్వారా మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నడిపిస్తామని పేర్కొన్నారు. ఈ సభల్లో మున్సిపల్ కమిషనర్ బి. వెంకట కిషన్ రావు, స్థానిక వార్డు కౌన్సిలర్లు, ప్రత్యేక అధికారులు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొని విజయవంతం చేశారు.



