ఘనంగా హనుమాన్ జయంతి ర్యాలీలు
విశ్వంభర, హైదరాబాదు : హనుమాన్ జయంతి సందర్భంగా నగరమంతా భక్తి ఉత్సాహంతో నిండిపోయింది. పలు ప్రాంతాల్లో భక్త సంఘాలు, ఆలయ కమిటీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు ఘనంగా నిర్వహించారు. కోటి, కాచిగూడ, నారాయణగూడ, అంబర్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్, చార్మినార్ పరిసరాల ఆలయాల వద్ద భక్తులు పెద్ద ఎత్తున చేరుకుని ర్యాలీలకు శ్రీకారం చుట్టారు. ప్రధాన రహదారులైన కాచిగూడ, నారాయణగూడ, హిమాయత్‌నగర్, బషీర్‌బాగ్, తిలక్‌నగర్, బర్కత్‌పుర మార్గాల మీదుగా ర్యాలీలు కొనసాగుతూ నగరానికి ఆధ్యాత్మిక వాతావరణాన్ని తెచ్చాయి. ర్యాలీలు ఆయా ప్రాంతాల ఆలయాలు, కమ్యూనిటీ గ్రౌండ్లు లేదా ప్రారంభ స్థలాల వద్ద ముగిశాయి. ర్యాలీల్లో యువత ఉత్సాహంగా పాల్గొని జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో నగరాన్ని మార్మోగించారు. భక్తి గీతాలు, భజనలు, సత్సంగాలు ర్యాలీలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మార్గమధ్యంలో భక్తులు సేవాభావంతో మజ్జిగ, మంచినీళ్లు, పులిహోర, ఆహార పొట్లాలు పంపిణీ చేస్తూ విశేష సేవలను అందించారు. పలు ప్రాంతాల్లో ప్రత్యేక మండపాలు ఏర్పాటు చేసి భక్తిని చాటుకున్నారు. ర్యాలీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా డైవర్షన్లు అమలు చేయడంతో ర్యాలీలు ప్రశాంతంగా, విజయవంతంగా ముగిశాయి.



