రామచంద్రాపురంలో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర
విశ్వంభర, పటాన్‌చెరు: హనుమాన్ జయంతిని పురస్కరించుకుని పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని ఓల్డ్ రామచంద్రాపురంలో హనుమాన్ శోభాయాత్ర అత్యంత వైభవంగా జరిగింది. గురువారం స్థానిక హనుమాన్ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన ఈ ర్యాలీని పటాన్‌చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ ఆదర్శ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. ముందుగా ఆదర్శ్ రెడ్డి దేవాలయంలో హనుమాన్ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హనుమాన్ స్వామి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్రంలో శాంతి, సమృద్ధి నెలకొనాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా యువత హనుమంతుని ధైర్యాన్ని, సేవా నిరతిని ఆదర్శంగా తీసుకుని సమాజ సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు. భక్తిభావంతో నిర్వహించే ఇలాంటి కార్యక్రమాలు ఐక్యతను చాటుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కుమార్ గౌడ్, బీఆర్‌ఎస్‌వీ కోఆర్డినేటర్ కృష్ణ కాంత్, పార్టీ నాయకులు సంపత్, జానీ, రామ్ శంకర్, రవి తేజ, నవీన్ గౌడ్, నాగరాజు గౌడ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు, స్థానిక ప్రజలతో రామచంద్రాపురం పురవీధులన్నీ జై శ్రీరామ్, జై హనుమాన్ స్మరణలతో మారుమోగాయి.



