ఆర్టీసి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
విశ్వంభర, హైదరాబాద్ : ఆర్టీసి కార్మికుల దీర్ఘకాలిక పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం ఇందిరాపార్కు వద్ద ఆర్టీసి జెఎసి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఛలో సెక్రటేరియట్’ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సమస్యల పరిష్కారం కోసం యాజమాన్యానికి, ప్రభుత్వానికి ఎన్నో మెమోరాండంలు సమర్పించినా స్పందన లేకపోవడంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాల్సి వచ్చిందని జెఎసి నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ, కార్మికుల ఆవేదనను ప్రభుత్వం ఇకనైనా అర్థం చేసుకోవాలని, తాను ఎమ్మెల్యే కాకముందే కార్మిక నాయకుడినాని, కార్మికుల కష్టాలు తనకు బాగా తెలుసునని అన్నారు. మీ పోరాటాలకు నేను అండగా ఉంటాను అని ఆర్టీసి కార్మికులను ఉద్దేశించి అన్నారు. ఆర్టీసి ఉద్యోగులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, వాటి పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేశారు. కార్మికుల డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. తెలంగాణ ఆర్టీసి జెఎసి ఛైర్మన్ ఈదురు వెంకన్న , హనుమంతు ముదిరాజ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్టీసి ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఇచ్చిన హామీ రెండున్నర సంవత్సరాలు గడిచినా అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మేనిఫెస్టో హామీలు నెరవేరకపోవడంతో కార్మికుల్లో అసంతృప్తి నెలకొందన్నారు. వైస్ ఛైర్మన్ ఎం. థామస్ రెడ్డి మాట్లాడుతూ, 2017 వేతన సవరణకు సంబంధించిన ఎరియర్స్ ఇప్పటికీ చెల్లించలేదని, అలవెన్సులు, ఫ్రింజ్ బెనిఫిట్స్ పెంపు చేయకపోవడం వల్ల కార్మికులకు ఆర్థిక నష్టం జరిగిందన్నారు. 2017లో రిటైరైన కార్మికులకు ఫిక్సేషన్లు జరిగినా సెటిల్మెంట్లు చేయలేదని తెలిపారు. 2021 వేతన సవరణను 30 శాతం ఫిట్‌మెంట్‌తో అమలు చేయాలని డిమాండ్ చేశారు. కన్వీనర్ ఎండి. మౌలానా మాట్లాడుతూ, 2019 నుంచి ట్రేడ్ యూనియన్లను నిర్వీర్యం చేయడంతో యాజమాన్య వేధింపులు పెరిగాయని ఆరోపించారు. ఈ ధర్నాలో ఆర్టీసి కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



