బెంగాల్ రాజకీయ చాణక్యుడు ముకుల్ రాయ్ కన్నుమూత
విశ్వంభర, కోల్‌కతా: కేంద్ర మాజీ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అగ్రనేత ముకుల్ రాయ్ (71) కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో గత కొంతకాలంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న ఆయన.. సోమవారం తెల్లవారుజామున కార్డియాక్ అరెస్ట్‌కు గురై తుదిశ్వాస విడిచినట్లు ముకుల్ రాయ్ కుమారుడు సుబ్రాన్షు వెల్లడించారు. ఆయన మృతిపట్ల పశ్చిమ బెంగాల్ రాజకీయ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (TMC) వ్యవస్థాపక సభ్యుల్లో ముకుల్ రాయ్ ఒకరు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్థుడు. టీఎంసీలో రెండో అత్యంత శక్తిమంతమైన నేతగా పేరొందిన ముకుల్ రాయ్.. 2017లో పార్టీని వీడి అందర్నీ ఉలిక్కిపాటుకు గురిచేశారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు భాజపాలో చేరిన ఆయన.. బెంగాల్‌లో పార్టీని విస్తరించడంలో కీలక పాత్ర పోషించారు. ఆ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ బెంగాల్‌లో 18 స్థానాల్లో గెలుపొందింది.2021లో జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే, అదే ఏడాది మళ్లీ తృణమూల్ గూటికి తిరిగొచ్చారు. ఒకప్పుడు ఆయనను బెంగాల్ రాజకీయ చాణక్యుడిగా పిలిచేవారు. కేంద్రంలో యూపీఏ సర్కారు రెండో దఫా అధికారంలో ఉన్న సమయంలో రైల్వే శాఖ మంత్రిగా వ్యవహరించారు. 2023లో డిమెన్షియా బారిన పడిన ఆయన.. అప్పటి నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. గతేడాది ముకుల్ రాయ్ శాసనసభ సభ్యత్వాన్ని కలకత్తా హైకోర్టు రద్దు చేసింది.



