సాంకేతిక పరిజ్ఞానంపై రైతులకు శిక్షణ
విశ్వంభర, గుండాల : బుధవారం గుండాల మండల కేంద్రంలోని రైతు వేదికలో ఆత్మ పథకంలో భాగంగా మండల వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్త రవీందర్ మాట్లాడుతూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందేందుకు రైతులు రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. సాధ్యమైనంత వరకు జీవామృతం తయారు చేసుకుని వినియోగించడం, పచ్చి రొట్టె సాగు చేయడం, పశువుల పేడ వంటి సహజ వనరులను ఉపయోగించడం మంచిదని తెలిపారు. అలాగే గులకలు, యూరియా వాడకాన్ని తగ్గించి అవసరమైనప్పుడు మాత్రమే నానో యూరియాను ఉపయోగించాలని సూచించారు. గుండాల మండల వ్యవసాయ అధికారి ఈ. సూరజ్ కుమార్ మాట్లాడుతూ నానో యూరియా వినియోగంతో యూరియా కొరత సమస్యను తగ్గించవచ్చని తెలిపారు. 45 కిలోల యూరియా బస్తాకు 500 మిల్లీలీటర్ల నానో యూరియా సమానమని వివరించారు. పంటలపై యూరియా చల్లితే అందులోని నత్రజని సగం మాత్రమే మొక్కలకు చేరుతుందని, మిగిలినది నేల మరియు నీటిలో కలసి కాలుష్యాన్ని పెంచుతుందని చెప్పారు. అదే నానో యూరియాను పిచికారీ చేయడం ద్వారా నత్రజని నేరుగా మొక్కలకు చేరి కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా సుమారు 8 శాతం వరకు దిగుబడి పెరగవచ్చని తెలిపారు. ఇఫ్కో జిల్లా మేనేజర్ ఎం. సాయి కృష్ణ మాట్లాడుతూ యూరియా కొరతతో పాటు డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల ధరలు అధికంగా ఉండటంతో ప్రత్యామ్నాయంగా నానో ఎరువులను రైతులు ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రస్తుతం యూరియా బస్తా ధర రూ.266 కాగా 500 మిల్లీలీటర్ల నానో యూరియా సీసా రూ.225కే లభిస్తుందని చెప్పారు. డీఏపీ బస్తా ధర రూ.1400 ఉండగా, నానో ఎరువు లీటరు బాటిల్ ధర సుమారు రూ.600గా ఉందన్నారు. మున్నారా అగ్రి టెక్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఈశ్వర్ మాట్లాడుతూ ఎరువులను నేలపై చల్లితే పంటలు కేవలం 30 శాతం మాత్రమే గ్రహిస్తాయని, మిగిలిన 70 శాతం వృథా అవుతుందని తెలిపారు. అయితే నానో ఎరువులను పిచికారీ చేస్తే పంటలు సుమారు 90 శాతం వరకు గ్రహిస్తాయని చెప్పారు. దీని వలన రైతులకు ఖర్చు తగ్గడమే కాకుండా పంటలకు అవసరమైన పోషకాలు సమర్థవంతంగా అందుతాయని తెలిపారు. అంతేకాకుండా యూరియా బస్తాలను మోసే కష్టం తగ్గి, ద్రవరూపంలోని నానో యూరియా బాటిళ్లను సులభంగా తీసుకెళ్లవచ్చని వివరించారు. వీటి వినియోగంతో చీడపీడల సమస్య కూడా కొంతవరకు తగ్గుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రామారం సర్పంచ్ నాగిరెడ్డి, నూనెగూడెం ఉప సర్పంచ్ ప్రశాంత్ రెడ్డి, గంగాపురం ఉప సర్పంచ్ వెంకన్న, ఏఈఓలు మరియు పలువురు రైతులు పాల్గొన్నారు.



