ఎట్టకేలకు వెలుగుమట్ల బాధితులకు న్యాయం

  • కూల్చిన చోటే 311 మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలు
  • బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు

విశ్వంభర, ఖమ్మం:  నిరుపేదల సొంతింటి కలను ఛిద్రం చేస్తూ ప్రభుత్వం చేసిన కూల్చివేతలపై భారతీయ జనతా పార్టీ చేసిన అలుపెరగని పోరాటం ఎట్టకేలకు ఫలించిందని బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు  బుధవారం ఒక పత్రికా ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఖమ్మం నగర పరిధిలోని వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇళ్లు కోల్పోయి వీధినపడ్డ బాధితులకు అడుగడుగునా అండగా నిలిచిన కమలనాథులు, సర్కారు మెడలు వంచి పేదలకు అదే స్థలంలో ఇళ్ల పట్టాలు సాధించిపెట్టారని ఆయన పేర్కొన్నారు. సుమారు పదిహేను రోజుల క్రితం, ఎటువంటి ముందస్తు నోటీసులు కానీ, కనీస సమాచారం కానీ ఇవ్వకుండా అర్ధరాత్రి వేళ భారీ పోలీసు బలగాల మోహరింపు మధ్య పేదల ఇళ్లను ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా కూల్చివేసింది. ఈ అమానుష చర్యతో వందలాది కుటుంబాలు నిరాశ్రయులై రోడ్డున పడ్డాయి. ఈ దారుణ ఘటన గురించి తెలుసుకున్న వెంటనే బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు తోపాటు జిల్లా, మండల,  స్థానిక నాయకులతో కలిసి తాను హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నామని కోటేశ్వరరావు గుర్తుచేశారు. బాధితుల ఆర్తనాదాలు విన్న తాము, ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడటమే కాకుండా, నిరాశ్రయులై ఖమ్మంలోని అంబేద్కర్ భవనంలో తలదాచుకుంటున్న బాధితులకు అండగా నిలిచి భోజన సదుపాయాలు కల్పించామని ఆయన తెలిపారు. స్థానిక నాయకత్వం ఈ సమస్యను రాష్ట్ర,  జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో విశేష కృషి చేసిందని ఆయన వివరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, సీనియర్ నాయకులు,  ఎంపీ ఈటల రాజేందర్ తదితర జాతీయ, రాష్ట్ర, జిల్లా నాయకులను వెలుగుమట్లకు తీసుకువచ్చి బాధితుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపాము. అధిష్టానం మద్దతుతో ఈ అన్యాయంపై జాతీయ ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్లకు ఫిర్యాదు చేశాము. స్పందించిన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ స్వయంగా వెలుగుమట్లను సందర్శించి అధికారుల ఏకపక్ష వైఖరిని ఎండగట్టారని ఆయన తెలిపారు. బీజేపీ శ్రేణులు బాధితులతో కలిసి రోజుల తరబడి రోడ్డెక్కి చేసిన ఆందోళనలు, ధర్నాల ముందు ప్రభుత్వం ఎట్టకేలకు దిగివచ్చిందని కోటేశ్వరరావు స్పష్టం చేశారు. వెలుగుమట్ల బాధితులకు ఇళ్లు కూల్చిన చోటే ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ పోరాట ఫలితంగా మొత్తం 311 మంది నిరుపేదలకు 75 గజాల చొప్పున సుమారు 5 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం బీజేపీ సాధించిన చారిత్రాత్మక విజయం అని ఆయన అభివర్ణించారు.

Tags: