పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు 

పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు 

విశ్వంభర, రామన్నపేట : యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల పరిధిలోని మునిపంపుల గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2025-26 ఎస్.ఎస్.సి (10వ తరగతి) విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 32 మంది పదవ తరగతి విద్యార్థులకు మునిపంపుల గ్రామంలోని భగత్ సింగ్ విజ్ఞాన కేంద్రం వారు గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం చేతుల మీదుగా ప్యాడ్, స్కేల్, రెండు పెన్నులు చొప్పున అందించడం జరిగింది. మాజీ ఎంపీటీసీ గాదె పారిజాత కూడా పెన్నులు బహూకరించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు దొడ్డి స్వామి  మాట్లాడుతూ, ఇప్పటి వరకు కష్టపడి చదివిన విద్యార్థులు తమ చదువుకు సఫలత చేకూర్చేలా ప్రశాంతంగా ఆలోచించి పరీక్షలు రాయాలని, మంచి మార్కులు పొంది తమ గురువులకు, తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తేవాలని, భవిష్యత్తులోనూ ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం మాట్లాడుతూ, విద్యార్థులు తమ భవిష్యత్తుకు తొలి మెట్టు అయిన ఎస్.ఎస్.సి లో మంచి మార్కులు పొంది ఉన్నత శిఖరాలకు చేరుకుని తమ తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చాలని కోరారు. అనంతరం విద్యార్ఢుల సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగాయి. ఈ కార్యక్రమంలో ఏ.ఏ.పిసి చైర్మెన్ వెంకటమ్మ, భగత్ సింగ్ యూత్ సభ్యులు గంటెపాక శివ, భిక్షం, ఉదయ్, ఉపాధ్యాయులు తిరుమల రెడ్డి, వెంకటేశ్వర్లు, వసంత, మనోహర్, మంజుల, త్రివేణి ప్రసాద్, సరోజ, పాల్వంచ హరికిషన్, శ్రీశైలం, సునిత, రాకేశ్, అమరయ్య, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Tags: