రద్దయిన ఈఎస్ఐ డిస్పెన్సరీలను పునరుద్ధరించాలి
విశ్వంభర, హైదరాబాదు : రద్దయిన ఈఎస్ఐ డిస్పెన్సరీలను వెంటనే పునరుద్ధరించి ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, రాష్ట్ర ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్‌కు శాశ్వత డైరెక్టర్‌ను నియమించాలి అని అర్బన్ డెవలప్మెంట్ ఫోరం కన్వీనర్ ఎం. శ్రీనివాస్ ప్రకటనలో డిమాండ్ చేసారు. తెలంగాణ రాష్ట్రంలో కార్మికుల వైద్య సేవల కోసం ఉద్యోగుల రాష్ట్ర బీమా సంస్థ (ఈఎస్ఐ కార్పొరేషన్) 2018లో అనుమతించిన డిస్పెన్సరీలు ఇప్పటివరకు ప్రారంభం కాలేదని తెలిపారు. వాటిని రద్దు చేయాలని కార్పొరేషన్ నిర్ణయం తీసుకోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు. 15 రోజుల్లో ప్రారంభిస్తే తిరిగి పునరుద్ధరిస్తామని ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎనిమిదేళ్ల క్రితం అనుమతి పొందిన డిస్పెన్సరీలు ఎందుకు ప్రారంభం కాలేదో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2023లో అనుమతి పొందిన మరో మూడు డిస్పెన్సరీలు కూడా ప్రారంభం కాలేదని తెలిపారు. రాష్ట్ర ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్‌కు గత ఏడేళ్లుగా శాశ్వత డైరెక్టర్ లేకపోవడం పరిస్థితిని మరింత దిగజార్చిందన్నారు. తాత్కాలిక డైరెక్టర్లతో వ్యవస్థ నడుస్తుండటంతో ఈఎస్ఐ ఆసుపత్రులు, డిస్పెన్సరీలు, కార్మికుల వైద్య సేవలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని తెలిపారు. రద్దయిన ఈఎస్ఐ డిస్పెన్సరీలను వెంటనే పునరుద్ధరించాలని, రాష్ట్ర ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్‌కు శాశ్వత డైరెక్టర్‌ను సత్వరమే నియమించాలని కోరారు.



