జర్నలిస్టులకు హెల్త్ కేర్ పథకాన్ని వర్తింపచేయాలి 

జర్నలిస్టులకు హెల్త్ కేర్ పథకాన్ని వర్తింపచేయాలి 

విశ్వంభర, హైదరాబాదు : ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేయనున్న కొత్త ‘తెలంగాణ ఎంప్లాయీస్ హెల్త్ కేర్’ పథకాన్ని రాష్ట్రంలోని జర్నలిస్టులకు కూడా వర్తింపజేయాలని కోరుతూ జర్నలిస్టు నాయకులు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి వినతిపత్రం అందజేశారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య, ఆద్వర్యంలో  జర్నలిస్టుల ఆరోగ్య సంబంధిత సమస్యలను మంత్రికి వివరించారు. రాష్ట్రంలో జర్నలిస్టులకు అమలులో ఉన్న హెల్త్ కార్డులు సక్రమంగా పనిచేయడం లేదని, ప్రయివేటు మరియు కార్పొరేట్ ఆస్పత్రుల్లో బిల్లుల పెండింగ్ పేరుతో చికిత్స అందించడం లేదని తెలిపారు. ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్నప్పటికీ సేవలు వేగంగా, నాణ్యంగా అందడం లేదని పేర్కొన్నారు. హైదరాబాదులోని నిమ్స్ ఆస్పత్రిలో కూడా పూర్తిస్థాయిలో ఉచిత వైద్య సేవలు అందడం లేదని వివరించారు. చాలీచాలని వేతనాలతో జీవనం సాగిస్తున్న జర్నలిస్టులు అధిక మొత్తంలో వైద్య ఖర్చులు భరించలేని పరిస్థితి నెలకొన్నదని తెలిపారు. జర్నలిస్టుల తరపున కంట్రిబ్యూషన్‌ను ప్రభుత్వమే చెల్లిస్తూ ఉద్యోగుల హెల్త్‌కేర్ పథకాన్ని వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో  తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ నాయకులు పి. రాంచందర్, రఘు, శేఖర్, రాజశేఖర్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

Tags: