చేనేత కుటుంబాన్ని ఆదుకోవాలి
విశ్వంభర, రామన్నపేట : చేనేత వృత్తిలో పూట గడవక అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్న యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, వెల్లంకి గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు మిర్యాల బాలరాజు కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గుండు వెంకట నర్సు డిమాండ్ చేశారు. బుధవారం రోజు రామన్నపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పత్రికా ప్రతినిధులతో వెంకటనర్సు మాట్లాడుతూ, నూలు రంగుల ధరలు పెరిగి నేసిన బట్టలు అమ్మకాలు లేక రోజంతా పని చేసినా పూట గడవక అప్పులపాలై చేనేత కార్మికులు చేసుకుంటున్న ఆత్మహత్యలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని అన్నారు. నూలు రంగులపైనే కాదు, నేసిన బట్టలపై కూడ జి.ఎస్టీ పేరుతో పన్నులు వేసి చేనేత పరిశ్రమను మోడీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని అన్నారు. చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ప్రకటనలకే పరిమితం అయ్యాయని, చేనేత రుణమాఫి, నేతన్న భరోసా, సంవత్సరంన్నర గడచిన అమలుకు నోచుకోలేదని, చనిపోయిన చేనేత కుటుంబాలకు ఏండ్లు గడచిన ఎక్స్ గ్రేషియా బాధిత కుటుంబాలకు అందడంలేదని విమర్శించ్చారు. మిర్యాల బాలరాజు కుటుంబాన్ని ఆదుకోవడంతో పాటు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం జిల్లా నాయకులు ముషం సత్యనారాయణ, ముషం శ్రీనివాసు, ఎలగందుల అంబాదాసు, కూరపాటి బిక్షపతి, ముషం చంద్రమౌళి, తదితరులు పాల్గొన్నారు.



